
నాగర్‌కర్నూల్ క్రైం: చిన్నారుల్లో బోదకాలు వ్యాధిని నియంత్రించేందుకు వైద్య సిబ్బంది కృషిచేయాలని డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ట్రాన్స్‌మిషన్ అసెస్‌మెంట్ సర్వే కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు, పారా మెడికల్ సిబ్బందికి రాష్ట్ర టీఓటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేష్, ఎండమాలజిస్ట్ సైదులు ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఒకటి, రెండో తరగతి చిన్నారులకు రక్త పరీక్షలు నిర్వహించి వారి శరీరంలో మైక్రో ఫైలేరియా క్రిమి ఉందో, లేదో విషయం తెలుసుకునే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. సర్వే కోసం 10బృందాలను ఏర్పాటు చేశామని ఒక్కో బృందంలో మెడికల్ ఆఫీసర్, సూపర్‌వైజర్, ఏఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ కలిసి పాఠశాలలను సందర్శిస్తారన్నారు. ఈ పరీక్షల్లో బోదకాలుకు సంబంధించిన క్రిమి ఫలితం వెంటనే తెలుస్తుందన్నారు. ఐదు రోజులలో సర్వే పూర్తి చేయడంతో పాటు ఒక సర్వే బృందం 150 నుంచి 200 మంది చిన్నారులకు పరీక్షలు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో 56 పాఠశాలలు ఎంపిక చేశామని , 50మంది వైద్య సిబ్బంది పాల్గొనున్నట్లు తెలిపారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్