
ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు స్థలం లేదు. ఇదే విషయమై ఎన్నోసార్లు అధికారులను కలవడం జరిగింది. ఏనాడు వారు వచ్చి మాకు స్థలం చూపించిన పాపాన పోలేదు. ఇప్పుడేమో తాత ముత్తాతల నుంచి ఉన్న సమాధులను జేసీబీతో తొలగించారు. సమాధులపైనే సీసీ రోడ్డు వేశారు. ఏడాదికోసారి పెద్దలకు పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టాలో తెలియక రోడ్డుపైనే పూలు చల్లి వస్తున్నాం.
– బుచ్చన్న, కర్రెమ్మ గుడి, వనపర్తి
ఇక్కడే పూడ్చాం..
అమ్మ, నాన్న, తమ్ముడి మృతదేహాలను ఇక్కడే పూడ్చాం. సమాధులను తొలగించేటప్పుడు కాలనీవాసులంతా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకుండా వాటిని తొలగించి, రోడ్లు వేశారు. కూలి, నాలి చేసుకొని బతికే మేము దీనిపై మున్సిపాలిటీలో అడిగాం. వారేమో గవర్నమెంట్‌ను అడగమని చెప్పారు. మా అమ్మ, నాన్న, తమ్ముడికి సంబంధించి సమాధులు లేవని తలచుకుంటేనే ఎంతో బాధగా ఉంది.
– సాయిలు, హరిజనవాడ, వనపర్తి
కలెక్టర్‌ను కలిశాం..
ఇలా తాళ్ల చెరువు కట్టమీద సమాధులను తొలగిస్తున్నారని తెలిసి పలుమార్లు కలెక్టర్‌ను కలిశాం. అయినప్పటికీ వినకుండా మా పెద్దవాళ్ల సమాధులను తొలగించారు. మా కుటుంబీకుల సమాధులను తొలగించి తాళ్లచెరువు కట్టకు ఎస్‌ఎన్‌ఆర్ మార్గ్ అని పేరు పెట్టుకున్నారు. ఇంత దౌర్జన్యం ఎక్కడా జరగదు.
– ఆగుపోగు కుమార్, దళితవాడ, వనపర్తి

