
జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు
నాగర్‌కర్నూల్ రూరల్: మన్ననూరు గురుకుల పాఠశాలలో మృతి చెందిన నాగిళ్ల నిఖిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని అఖిల పక్ష, ప్రజాసంఘాల నాయకులు స్పష్టం చేశారు. శనివారం ఆమె మృతికి నిరసనగా నాగర్‌కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన సభను ఏర్పాటు చేసి పలువురు వక్తలు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు మాట్లాడుతూ.. దళిత కుటుంబానికి ఒక న్యాయం మిగతా కుటుంబాల వారికి మరొక న్యాయమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిఖిత మృతిపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పోలీసులు ఈ మృతిపై నిజానిజాలు తేల్చి దోషులను కఠినంగా శిక్షించేందుకు కృషి చేయాలన్నారు.
మృతికి కారణాలు స్పష్టం చేయాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. నిఖిత కుటుంబానికి కావాల్సింది దళితబంధు, డబుల్ బెడ్‌రూం కాదని వారి కుటుంబ సభ్యులే స్పష్టం చేస్తున్నారని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మృతికి గల కారణాలను స్పష్టం చేయాలన్నారు. ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు వంకేశ్వరం నిరంజన్ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులకు ప్రతిదాడులు జరగాలని అప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కోళ్ళ శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితులపై దాడులు పెరిగాయని, జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులు నిఖిత హత్యకు గల కారణాలను చెప్పడంలో ఎందుకు జంకుతున్నారని, దోషులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 48 గంటల్లో దోషులపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.శ్రీనివాసులు, గూట విజయ్, కందికొండ గీత, నాగం శశిధర్‌రెడ్డి, మంగి విజయ్, వైఎస్సార్‌టీపీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థి నిఖిత మృతికి కారకులను అరెస్టు చేయాలి
బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
అఖిల పక్ష, ప్రజా సంఘాల
నాయకుల డిమాండ్
బంద్ ప్రశాంతం
విద్యార్థిని నిఖిత మృతికి కారకులపై చర్య తీసుకోవాలంటూ శనివారం నాగర్‌కర్నూల్ పట్టణంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు. నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలని, మృతికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

సభలో మాట్లాడుతున్న జెట్టి ధర్మరాజు