
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటి ప్రియా మరాఠే(38) కన్నుమూసింది. పలు టీవీ సీరియల్స్లో నటించిన ఆమె చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో ఆమె బాధపడుతోంది. సుదీర్ఘకాలం క్యాన్సర్ పోరాటం చేసిన ప్రియా మరాఠే మీరా రోడ్‌లోని తన నివాసంలోనే మరణించింది.
మరాఠీకి చెందిన నటి ప్రియా మరాఠే 1987 ఏప్రిల్ 23న ముంబయిలో జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. అనంతరం మరాఠీ సీరియల్ 'యా సుఖనోయ'తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ సీరియల్స్లో నటించింది. బాలీవుడ్లో పవిత్ర రిష్టా సీరియల్తో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో సుశాంత్ రాజ్పుత్, అంకిత లోఖాండే కీలక పాత్రల్లో నటించారు. ప్రియా చివరిసారిగా మరాఠీ సీరియల్ తుజెచ్ మి గీత్ గాత్ ఆహేలో కనిపించింది. కాగా.. ప్రియా 2012లో నటుడు శంతను మోఘేను వివాహం చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ లేదు. చివరిసారిగా ఆగస్టు 11, 2024న పోస్ట్ చేసింది. నటి తన భర్తతో జైపూర్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.
ప్రియా మరాఠే తన కెరీర్‌లో చార్ దివాస్ ససుచే, కసమ్ సే, పవిత్ర రిష్టా, ఉత్తరన్, తూ తిథే మీ, భాగే రే మన్, సాథ్ నిభానా సాథియా, స్వరాజ్యరక్షక్ సంభాజీ, జయస్తుతే, భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్ లాంటి సీరియల్స్తో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా హిందీలో హమ్నే జీనా సీఖ్ లియా చిత్రంలో కనిపించారు. మరాఠీ చిత్రం 'తి అని ఇటార్'లోనూ నటించారు. ఈ విషాద వార్త విన్న ప్రియా మరాఠే అభిమానులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.