తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలేమో ఏళ్లకేళ్లు ఒకే మూవీపై గడిపేస్తున్నారు. ఇలా ఎందుకంటే పాన్ ఇండియా, ఫెర్ఫెక్షన్ అంటున్నారు. పోనీ కంటెంట్ ఏమైనా సూపర్ అంటే రిలీజ్ తర్వాత ట్రోల్ కావడం తప్పితే ప్రశంసలు చాలా తక్కువగా వస్తున్నాయి. మరోవైపు రిలీజ్ డేట్స్ విషయంలోనూ ప్రతిసారీ 'వాయిదా' పంచాయతీ నడుస్తోంది. ఈ సమస్యలన్నింటిపై హీరో నాగార్జున స్పందించారు. నవ్వుతూనే నిష్ఠూరమైన నిజాలన్నీ బయటపెట్టేశారు. 'ఇట్లు అర్జున' అనే చిన్న సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నాగ్.. ఈ చిత్ర లేటెస్ట్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)
లెక్క ప్రకారం 'ఇట్లు అర్జున' మూవీ అక్టోబర్ 02న రిలీజ్ ప్లాన్ చేశారు. తీరా ఆ తేదీకి వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' వస్తున్నట్లు ప్రకటించారు. వీళ్లు వచ్చారు కదా 'ఇట్లు అర్జున' టీమ్ డేట్ మార్చుకుంటే మళ్లీ 09వ తేదీ అన్నారు. దీంతో 'ఇట్లు అర్జున' అక్టోబర్ 30న వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. 'ఆదర్శ కుటుంబం' మాత్రం నిరవధిక వాయిదా పడింది. అంటే ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. పేరు చెప్పనప్పటికీ వెంకీ-త్రివిక్రమ్ మూవీ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నాగార్జున.. రిలీజ్ డేట్స్ మారుతుంటే మా వాళ్లు షేక్ అయిపోతున్నారు. వాళ్లు పడుతున్న యాతన ఇంతా అంతా కాదు. డేట్‌కి రావాలి. లేదంటే డేట్ ఇవ్వకూడదు. డేట్ చెప్పి, ఆ రోజు రాకపోవడం కరెక్ట్ కాదని అన్నారు.
సినిమాను ఎవరూ కావాలని వాయిదా చేయరు. అయినా సరే, సరైన ప్లానింగ్ ఉండాలి. కనీసం నెలన్నర ముందైనా సినిమా కంప్లీట్ చేసుకోవాలి. అలానే పాన్ ఇండియా అనేది పెద్ద తలనొప్పి వ్యవహారం. అదంతా నాన్సెన్స్ అని చెప్పిన నాగార్జున.. తన 100వ సినిమా రిలీజ్ డేట్ డిసెంబరు 24న అని ప్రకటించినప్పటి నుంచి ఆ రోజున రావాలని పగలు-రాత్రి కష్టపడుతున్నామని చెప్పుకొచ్చారు.
అలానే ప్రస్తుతం సినిమాల్లో ఉంటున్న వీఎఫ్ఎక్స్ల గురించి మాట్లాడుతూ.. అవి యూట్యూబ్‌లో చూస్తే బాగానే అనిపిస్తాయి. కానీ సరిగ్గా లేకపోతే థియేటర్లో పెద్ద స్క్రీన్‌పై దొరికిపోతాం.ఈ మధ్య ఒళ్లు దగ్గర పెట్టుకొని చేసిన సినిమాలే బాగా ఆడుతున్నాయి. ప్రజలే చెబుతున్నారు వాళ్లకేం కావాలనేది. లేదు అంటే నిర్మాతలకు చాలా రిస్క్. చిరంజీవి కానీ, నేను కానీ నాలుగు దశాబ్దాల క్రితం వచ్చాం. మేం ఒక కల్చర్‌కి అలవాటు పడ్డాం. అందుకే మేం ఇలా చేయగలగుతున్నామని నాగార్జున తన మనసులోని కోపాన్ని అంతా బయటపెట్టేశారు. మరి ఇవన్నీ విని అయినా సరే యువ దర్శకనిర్మాతలు మారతారేమో చూడాలి?
(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)


