ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ థాంక్యూ: మహేష్‌ బాబు

Mahesh Babu Thanks CM YS Jagan Cinema Restart Package - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ అన్న నిర్ణయం అమోఘం: మంచు మనోజ్‌

హైదరాబాద్‌: కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమపై వరాలు కురిపించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నటుడు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. సీఎం తన నిర్ణయంతో లాక్‌డౌన్‌ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చొరవతో మూవీ ఇండస్ట్రీకి జవసత్వాలు చేకూరుతాయన్నారు. ఈ మేరకు నాగబాబు ట్వీట్‌ చేశారు.

కాగా థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని తెలిపింది. దీంతో సినీ ప‍్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: సినీ పరిశ్రమకు ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం)

బిగ్‌ థాంక్యూ: మహేష్‌ బాబు
‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం హర్షణీయం! విపత్కర సమయంలో ఇలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ థాంక్యూ. తెలుగు సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవంతో వెలిగిపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి. సినిమా మళ్లీ ట్రాక్‌లో పడుతోంది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం పట్ల సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: పూరి జగన్నాథ్‌
‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా లబ్ది చేకూరుతుంది. ఇలాంటి గొప్ప నిర్ణయం వల్ల కోవిడ్‌ మహమ్మారితో చితికిపోయిన పరిశ్రమ తిరిగి నిలదొక్కుకుంటుంది’’ అని టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు. ఇక మంచు మనోజ్‌.. సరైన సమయంలో స్పందించి వరాల జల్లు కురిపించిన జగనన్న చొరవ, నాయకత్వం అమోఘం అని పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top