పారిపోలేరు... దాక్కోనూలేరు | Kamal Haasan Indian 2 Trailer Release | Sakshi
Sakshi News home page

పారిపోలేరు... దాక్కోనూలేరు

Jun 26 2024 12:07 AM | Updated on Jun 26 2024 6:52 AM

Kamal Haasan Indian 2 Trailer Release

‘ఊరారా ఇది... చదువుకు తగ్గ జాబ్‌ లేదు... జాబ్‌కి తగ్గ జీతం లేదు... కట్టిన ట్యాక్స్‌కి తగినట్టు ఫెసిలిటీస్‌ దొరకడం లేదు’, ‘దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’ అంటూ ఓ మహిళ ఆవేదనతో చెప్పే డైలాగులతో ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ ఆరంభమైంది.

కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు’ (1996)కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2, భారతీయుడు 3’ చిత్రాలు రూపొందాయి. సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, కాజల్‌ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్, గుల్షన్‌ గ్రోవర్‌ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకాలపై సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్‌ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో జూలై 12న విడుదల కానుంది.

కాగా మంగళవారం ముంబైలో ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకని నిర్వహించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ట్రైలర్స్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం... గాంధీజీ మార్గంలో మీరు... నేతాజీ మార్గంలో నేను’, ‘సో పారిపోలేరు... దాక్కోనూలేరు’, ‘టామ్‌ అండ్‌ జెర్రీ ఆట ఆరంభమైంది’ అంటూ కమల్‌హాసన్‌ చెప్పే డైలాగులు ట్రైలర్‌ ఉన్నాయి. ఇదిలా ఉంటే... ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ, సీడెడ్‌ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్‌ సంస్థలు దక్కించుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement