‘‘నేను కథ కంటే స్క్రీన్‌ప్లేని నమ్ముతాను. కథను కాపీ కొట్టగలరేమో కానీ స్క్రీన్‌ప్లేని కాపీ కొట్టలేరు. కోటిన్నరతో చేసిన ‘కలర్ ఫోటో’ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. ‘మోగ్లీ’ విషయంలోనూ నాకు ఇచ్చిన బడ్జెట్‌లోనే ఎంత గొప్పగా తీయగలను అన్నది చూసుకున్నాను. ఉన్న పేరుని చెడగొట్టుకోవద్దని అనుకున్న బడ్జెట్‌లోనే ఈ సినిమాని అద్భుతంగా తీశానని అనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ సందీప్ రాజ్ తెలిపారు. రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్ జంటగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో చిత్రదర్శకుడు సందీప్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘కలర్ ఫోటో’ తర్వాత ఓ స్టార్ హీరోతో సినిమా తీయాలని కథ రాసుకున్నా. అయితే ఆయన బిజీగా ఉండటంతో ఆ ్రపాజెక్ట్ ఆలస్యమవుతోందని ‘మోగ్లీ 2025’ తీశాను. జంగ్లీ బుక్‌లోని మోగ్లీకి మా మోగ్లీకి సంబంధం ఉండదు. యూత్, ఫ్యామిలీ, మాస్... ఇలా అందర్నీ మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఓ బలమైన ఫిలాసఫీని చూపించా. ‘బబుల్‌గమ్’ సినిమా చూశాక నా కథకి రోషన్ సరిపోతాడనిపించింది. ఈ మూవీ కోసం తను చాలా కష్టపడ్డాడు.
డెఫ్ అండ్ డంబ్ పాత్రని సాక్షి అద్భుతంగాపోషించారు. మా చిత్రంలో బండి సరోజ్‌గారి పాత్రను చూసి అంతా షాక్ అవుతారు. ‘మోగ్లీ’ ఔట్‌పుట్‌పై విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌గార్లు సంతృప్తిగా ఉన్నారు. నటుడు కావాలనే నా ఆకాంక్షను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను. నా దర్శకత్వంలో నేను నటించడం కంటే ఇతర డైరెక్టర్స్ సినిమాల్లో చేయడం ఇష్టం. నటుడిగా రెండు సినిమాలు చేస్తున్నాను. దర్శకుడిగా–నటుడిగా ‘ఎ.ఐ.ఆర్’ వెబ్ సిరీస్ 2 ఉంటుంది’’ అని చెప్పారు.


