
వన మహోత్సవానికి సన్నద్ధం
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా శాఖల వారీగా ఎక్కడెక్కడ, ఏ రకాల మొక్కలు నాటాలనే విషయమై ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 492 గ్రామాలుండగా, 471 నర్సరీలు కొనసాగుతున్నాయి. వీటిలో 52.57 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది 37.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో సింహభాగం డీఆర్‌డీఓ శాఖ పరిధిలో 25.66 లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 7.20 లక్షల మొక్కలు నాటనున్నారు. మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో 90 వేల చొప్పున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అటవీ జాతి మొక్కలే అధికం
ఈ సంవత్సరం నాటే మొక్కల్లో అటవీ జాతికి చెందిన మొక్కలనే అధికంగా నాటనున్నారు. ఇందులో ప్రధానంగా గుల్‌మహర్, రేణి, సీతాఫల్, నలిమినార, రావి, మర్రి, మద్ది, వేట, టేకు, తదితర అటవీ జాతికి చెందిన మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగితావి ఇళ్లలో పెంచుకునేందుకు కొన్నిరకాల పూల మొక్కలను సైతం సిద్ధంగాఉంచారు.
శాఖల వారీగా లక్ష్యం
డీఆర్‌డీఓ 25,66,000
అటవీ 7,20,000
వ్యవసాయ 30,000
ఉద్యాన 25,000
పరిశ్రమలు 15,000
ఇరిగేషన్ 10,000
మైనింగ్ 15,000
ఎకై ్సజ్ 40,000
డీడబ్ల్యూఓ 6,000
ఇతరశాఖలు 23,000
మెదక్ మున్సిపాలిటీ 90,000
నర్సాపూర్ 90,000
రామాయంపేట 30,000
తూప్రాన్ 50,000
జిల్లాలో 24 శాతం మేర అడవులు
జిల్లాలో అన్నిరకాల భూములు 6 లక్షల వరకు ఉండగా, భూ భాగానికి 33 శాతం అడవులు ఉండాలి, కానీ జిల్లాలో కేవలం 24 శాతం మేరకు మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ లెక్కన ఇంకా 9 శాతం మేర అడవులు తక్కువగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం అయి నెల రోజులు కావొస్తున్నా జిల్లాలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. కాగా వానలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 37.10 లక్షల మొక్కలు లక్ష్యం
శాఖల వారీగా కేటాయింపు
సమృద్ధిగా వర్షాలు కురవగానేప్రారంభం