
ఎల్‌ఆర్‌ఎస్ ఆదాయం రూ.26.69కోట్లు
● 25శాతం రాయితీ గడువు పూర్తి ● సద్వినియోగం చేసుకున్నది కొందరే.. ● గడువు తర్వాత చెల్లింపులపై సందిగ్ధం
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా జిల్లాలో రూ.26.69కోట్ల ఆదాయం సమకూరింది. రాయితీ అవకాశం కల్పించినా కొందరే సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2020లో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి 25శాతం రాయితీ ప్రకటించగా ఈ నెల 3న గడువు ముగిసింది. మార్చి 31వరకు 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు మొదట ప్రభుత్వం అవకాశం కల్పించగా.. ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, కొంత గందరగోళం నేపథ్యంలో ఏప్రిల్ 30వరకు గడువు పొడిగించింది. అయినప్పటికీ సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం, మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతులు ఇవ్వడంలోనూ జాప్యం జరిగింది. దీంతో మరోసారి ఈ నెల 3వరకు గడువు పొడిగించినా దరఖాస్తుదారులు సద్వినియోగానికి ముందుకు రాకపోవడం గమనార్హం. మరోసారీ ప్రభుత్వం గడువు పెంచుతుందని దరఖాస్తుదారులు భావించినా ఆదివారం సెలవు కావడంతో గడువు పెంపు ఉత్తర్వులు రాలేదు. సోమవారం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుదారులకు 25శాతం రాయితీ కనిపించడంతో కొందరు చెల్లించారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ఫీజుల రూపంలో ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతుందని భావించినా అంతంత మాత్రంగానే సమకూరింది.
జిల్లాలో..
జిల్లాలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లా వ్యాప్తంగా 55,697 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 33,529, 16 మండలాల్లో 10,728, ఐదు మున్సిపాలిటీల్లో 11,440 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు ఫీజు ధ్రువీకరించినవి 31,084 ఉన్నాయి. ఇందులో నుంచి 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకుని ఫీజు చెల్లించింది 10,427 దరఖాస్తుదారులు మాత్రమే. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకోని వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించగా 780మంది సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల ద్వారా రూ.26.69కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో మంచిర్యాల కార్పొరేషన్ నుంచి రూ.16.18 కోట్లు, 16 మండలాల నుంచి రూ.5.27 కోట్లు, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్‌పల్లి, చెన్నూరు మున్సిపాలిటీల నుంచి రూ.5.29 కోట్ల ఆదాయం వచ్చింది. మిగతా వారు ఫీజులను చెల్లిస్తే జిల్లా నుంచి రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉండేది. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీ గడువును పొడిగించి, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.