
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని పూలాజీబాబానగర్‌లో మండాలి బక్కన్న ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని పూలాజీబాబా నగర్‌కు చెందిన మండాలి బక్కన్న కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లాడు. రాత్రి 10.30 గంటలకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి రెండు తులాల బంగారం, రూ.లక్ష 50వేల నగదు దొంగతనం చేసినట్లు గుర్తించారు. దొంగలు ఇంటి వెనుకవైపు ఉన్న కిటికీ నుంచి పారిపోయారని తెలిపారు. ఎస్సై సాయన్న అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందం రప్పించి దర్యాప్తు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.