
తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓ వరం
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓ వరం లాంటిదని రాష్ట్ర ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించి డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 10వ తరగతిలోపు, డ్రాప్ అవుట్ విద్యార్థులను ఓపెన్ పదోతరగతిలో, పది పాసైన విద్యార్థులను ఓపెన్ ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పది, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 11 వరకు గడువు ఉందని, రూ.200 అపరాధ రుసుంతో ఆగష్టు 12 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి మహిళకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) పథకాన్ని ప్రవేశపెట్టిందని.. 15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఎం ప్రభాకర్, డీడబ్ల్యూఓ సుధారాణి, నితిన్, రాజేంద్రప్రసాద్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.