విత్తన పత్తి. . ! | - | Sakshi
Sakshi News home page

విత్తన పత్తి. . !

Jul 4 2025 3:37 AM | Updated on Jul 4 2025 3:37 AM

విత్త

విత్తన పత్తి. . !

మొదటి పేజీ తరువాయి

ఇతర ప్రాంతాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో సీడ్‌ పత్తి సాగవుతోంది. అయితే ఈ పంట సాగుకు ఖర్చు ఎక్కువ. ఈ క్రమంలో పెట్టుబడి అవసరాలను ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులే సీడ్‌ ఆర్గనైజర్లుగా మారగా.. ఈ వ్యవస్థ ప్రస్తుతం రైతుల భవిష్యత్‌ను శాసిస్తోంది. సీడ్‌ పత్తి సాగుదారులకు పెట్టుబడి అందిస్తూ వచ్చిన వారు దోపిడీకి తెగబడ్డారు. రైతుల నుంచి సీడ్‌ పత్తిని సేకరించి కంపెనీలకు అప్పగించడం.. వారు చెల్లించిన డబ్బులను రైతులకు చెల్లించడంలో మోసాలకు తెరలేపారు. విత్తనాలను తమకే విక్రయించాలనే నిబంధనతో పెట్టుబడి కింద ఇచ్చిన మొత్తాన్ని రూ.100కు రూ.2 నుంచి రూ.5 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. విత్తనాలు ఫెయిల్‌ కాకున్నా.. అయ్యాయని, నాణ్యత లేదని రైతులను నిలువునా ముంచుతున్నారు. తొలుత 40 మంది వరకు మాత్రమే ఆర్గనైజర్లు ఉండగా.. సబ్‌ ఆర్గనైజర్లతో కలిపి 300 మంది వరకు దందా నడిపిస్తున్నారు.

తాజాగా సీలింగ్‌ మెలిక..

కంపెనీలు సీలింగ్‌ పెట్టాయంటూ సీడ్‌ ఆర్గనైజర్లు ఎకరాకు 200 పాకెట్ల విత్తనాలను మాత్రమే కొంటామని తాజాగా మెలిక పెట్టడం సాగుదారుల్లో అలజడి సృష్టిస్తోంది. విత్తనాలు పెట్టి నెల దాటగా వేసిన పంటను తొలగిస్తే ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు ఇస్తామని ఆర్గనైజర్లు చెబుతున్నారని.. కానీ ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అయిందని వాపోతున్నారు. ఇతర పంటలు వేసే కాలం అయిపోయిందని.. ఎకరాకు ఉత్పత్తయ్యే సీడ్‌ మొత్తాన్నీ తీసుకోవాల్సిందేనని.. లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా, సీలింగ్‌ నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

గడువులోపు డబ్బులివ్వరు.. వడ్డీ మాత్రం వసూలు

సీడ్‌ పత్తి కంపెనీలు ఏటా మేలో రైతులకు ఫౌండేషన్‌ సీడ్స్‌ అందజేస్తున్నాయి. పంట చేతికొచ్చిన తర్వాత రైతులు డిసెంబర్‌లో ఆర్గనైజర్ల ద్వారా కంపెనీలకు విత్తనాలు ఇస్తున్నారు. గ్రోత్‌ ఔట్‌ టెస్ట్‌ (జీఓటీ)లో పాస్‌ అయిన విత్తనాల డబ్బులు నాలుగైదు నెలల తర్వాత రైతులకందుతున్నాయి. అయితే పెట్టుబడికి తీసుకున్న మొత్తంపై ఈ కాలానికి సంబంధించిన వడ్డీని రైతులు చెల్లించాల్సి వస్తోంది. ఎప్పుడూ ఏప్రిల్‌, మేలో కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా విత్తన డబ్బులను చెల్లిస్తుండగా.. ప్రస్తుతం ఇప్పటివరకు రాలేదు. గద్వాల జిల్లాలో గత ఏడాది సీడ్‌ పత్తి సాగుదారులకు చెల్లించాల్సిన రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌లో ఉండగా.. వారు ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్నారు.

రైతు సంక్షేమ కమిషన్‌పై తిరుగుబాటా?

ఇటీవల రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి గద్వాల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో సీడ్‌ పత్తి సాగు పంటను పరిశీలించిన ఆయన జిల్లా కలెక్టరేట్‌లో రైతులు, కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీడ్‌ పత్తి సాగుదారులకు జరుగుతున్న అన్యాయంపై రైతులతో పాటు పలు సంఘాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాయి. అప్పుడు, ఆ తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీడ్‌ ఆర్గనైజర్ల తీరుపై కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న విత్తన చట్టాన్ని ఉల్లంఘిస్తూ పలు అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. త్వరలో నూతన విత్తన చట్టం తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమకు ఇబ్బందులు తప్పవని యోచించిన ఆర్గనైజర్లు కొత్త ఎత్తుగడకు దిగినట్లు తెలుస్తోంది. రైతులను ఇబ్బంది పెట్టేలా సీలింగ్‌కు తెరలేపడంతోపాటు రైతు కమిషన్‌ హెచ్చరికలకు బెదిరేది లేదనే సంకేతాన్ని పంపించినట్లు రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా మాఫియాగా మారిన ఆర్గనైజర్ల వ్యవస్థపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నాయి.

ఇంకా రూ.2.50 లక్షలు రావాలి..

గత ఖరీఫ్‌లో నాకున్న 3 ఎకరాల్లో వేద రాయల్‌ సీడ్స్‌ కంపెనీ పత్తి సీడ్‌ పంట సాగు చేశాను. మొత్తం 11.40 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. రూ.4 లక్షలు పెట్టుబడికి వాడుకున్నా. ఇవి పోను లెక్క చేసిన రూ.2.50 లక్షలు నాకు రావాల్సి ఉంది. ఆ డబ్బులను ఆర్గనైజర్‌ ఇప్పటివరకు ఇవ్వలేదు. డబ్బులడిగితే విత్తనాలు ఫెయిల్‌ అయ్యాయని చెబుతున్నాడు. కంపెనీ దగ్గర చెక్‌ చేస్తే పాస్‌ అయినట్లు ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. – జయప్ప, ఇర్కిచేడు, కేటీదొడ్డి

విత్తన పత్తి. . ! 1
1/1

విత్తన పత్తి. . !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement