
చిన్నరాజమూర్ గుట్టల్లో చిరుత సంచారం
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం, చిన్నరాజమూర్ సమీపంలోని పులిగుట్టపై శనివారం చిరుత సంచారం కలకలం రేపింది. సాయంత్రం సమయంలో రహదారిపై వెళ్తున్న గ్రామ యువకులకు గుట్టపై చిరుత సంచరిస్తూ కనిపించింది. కొద్దిసేపు గుట్టపై అటు, ఇటు తిరిగి అక్కడే ఉన్న చిన్న గుహలోకి వెళ్లిందని, చిరుతతో పాటు ఒక చిన్న చిరుత పిల్ల కూడా ఉండటం గమనించినట్లు యువకులు తెలిపారు. గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు, సమీప వ్యవసాయ పొలాల రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.
జూరాలకు నిలకడగా ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 7,500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 68 క్యూ సెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,533 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.551 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.

చిన్నరాజమూర్ గుట్టల్లో చిరుత సంచారం