
నేరాల నియంత్రణకు ‘చెక్ డివైజ్’
కర్నూలు: నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీ విధుల్లో ఉంటే పోలీసులు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ (ఎంఎస్‌సీడీ) తప్పనిసరిగా ఉపయోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించే వారి వేలి ముద్రలను సేకరించి నేర రికార్డులతో వాటిని సరిపోల్చి నేరస్తులను పట్టుకోవాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో కేసులు పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. డయల్ 100కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమస్యాత్మక ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు, బారికేడ్స్, జిగ్‌జాగ్ డ్రమ్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయ మహిళా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. అడ్మిన్ ఏఎస్పీ హు సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, బాబు ప్రసాద్, భాస్కర్‌రావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
అనుమానాస్పదంగా కనిపించే వారి
వేలిముద్రలు సేకరించాలి
నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్ పాటిల్

నేరాల నియంత్రణకు ‘చెక్ డివైజ్’