గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన కళా ప్రదర్శన
సాక్షి, అమరావతి: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్‌ఎస్) విద్యార్థుల కళా ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సీటీ ప్రాంగణంలో ఆరవ జాతీయ ఉద్భవ్–2025లో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన ఏకలవ్య స్కూల్స్ విద్యార్థుల సంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవాలు కనుల విందుగా జరిగాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రధాన వేదిక అయిన కృష్ణ జింక ఆడిటోరియంలో దాదాపు 22 రాష్ట్రాల నుంచి వచ్చిన సీనియర్ విభాగంలో విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు వివిధ గిరిజనుల సంస్కృతులను, వారి వ్యవహార శైలితో పాటు ఆచార వ్యవహారాలను చాటి చెప్పడమే కాకుండా వారి నృత్యాలతో హావభావాలతో వీక్షకులను అలరింపజేశారు. నృత్య ప్రదర్శనతోపాటు కథల పోటీలు, ఉపన్యాస పోటీలు, పలు భాషలలో సృజనాత్మక రచన వంటి దాదాపు 18 రకాల పోటీలను వివిధ వేదికలపై నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా జీఎల్ పురం నుంచి సీనియర్ విభాగంలో ఈఎంఆర్‌ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ వీర నృత్యం వారి వేడుకల అంశంతో కోలాటం, నృత్యం అద్భుతంగా సాగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ జాతీయ కళా ఉత్సవాల్లో పాల్గొన్నారు.


