ఎనస్థీషియా డ్రగ్ సేఫ్టీపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎనస్థీషియా డ్రగ్ సేఫ్టీపై డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం నూతన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. రోగి భద్రతను మెరుగుపరచడం, వైద్య విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా వైద్య వర్గాలకు ఉపయుక్తమైన ఒక ప్రధాన అకడమిక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఔషధ దోషాలు గుర్తింపు, నష్ట నివారణ, రక్షణ వ్యూహాలు అనే అంశంపై ఉన్నత స్థాయి వెబినార్‌ను యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌హాల్‌లో, వెబెక్స్ ద్వారా వర్చువల్‌గా సదస్సు నిర్వహించింది.
‘ఎనస్థీషియా డ్రగ్ ఎర్రర్స్’ పుస్తకం ఆవిష్కరణ..
అమెరికాలోని ఐపీఏఆర్‌సీఓఏ సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్ ఆర్. కరుపర్తి అధ్యక్షత వహించగా, ఐయోవా యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ మాజీ ఎనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ రాబర్ట్ ఎం. ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఉపన్యాసం అనంతరం వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ‘ఎనస్థీషియా డ్రగ్ ఎర్రర్స్’ పుస్తకాన్ని విడుదల చేసి, భారత అకడమిక్ వర్గాలకు పరిచయం చేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికారెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. లక్ష్మీసూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.


