
లంచగొండ్లపై ఆకస్మిక దాడి
బనశంకరి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తూ, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై లోకాయుక్త అధికారులు పంజా విసిరారు. బెంగళూరు, గ్రామాంతర, తుమకూరు, యాదగిరి, మంగళూరు, విజయపుర జిల్లాల్లో 7 మంది అవినీతి అధికారులపై లోకాయుక్త అధికారులు, ఏకకాలంలో దాడులు నిర్వహించి కోట్లాది రూపాయల విలువచేసే అక్రమాస్తులు కనిపెట్టారు. గురువారం తెల్లవారుజామున 7 మంది అధికారులకు చెందిన 40 చోట్ల సోదాలు చేపట్టి పెద్ద మొత్తంలో నగదు, బంగారు వెండి ఆభరణాలు, వాహనాలు, ఇళ్లు, స్థలాల పత్రాలతో పాటు కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తిపాస్తులను గుర్తించినట్లు సమాచారం. విచ్చలవిడిగా లంచాలు తీసుకోవడం, ఆదాయానికి మించి ఆస్తులు గడించారనే ఆరోపణలు రావడంతో బెంగళూరులో 12, తుమకూరులో 7, బెంగళూరు గ్రామాంతరలో 8, యాదగిరిలో 5, మంగళూరులో 4, విజయపురలో 4 చోట్ల సోదాలు జరిగాయి. సోదాలు ఇంకొ కానసాగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లను తనిఖీ చేయాల్సి ఉందని లోకాయుక్త వర్గాలు తెలిపాయి.
కలబురిగిలో
కలబురిగి శహపుర తహశీల్దార్ ఉమాకాంత్‌హళ్లి ఇంటిపై దాడిచేసిన లోకాయుక్త అధికారులు అక్కమహాదేవి లేఔట్‌లో తహశీల్దార్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు.
మంగళూరు, యాదగిరి..
మంగళూరు సర్వే సూపర్‌వైజర్ మంజునాథ్, విజయపుర డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అభివృద్ది మండలి అధికారిణి రేణుకా, యాదగిరి శహపుర తాలూకా కార్యాలయం అధికారి ఉమాకాంత్ ఇళ్లు, కార్యాలయంపై లోకాయుక్త అదికారులు దాడిచేశారు. విజయపుర నగరలో సెయింట్ జోసెఫ్ పాఠశాల వెనుక అంబేడ్కర్ మండలి జిల్లా మేనేజర్ రేణుకా సాతార్లే నివాసంలో, ఆఫీసులోను గాలింపు జరిపారు.
బెంగళూరు రూరల్..
బెంగళూరు గ్రామాంతర జిల్లా హొసకోటే తాలూకా బోదనహొసహళ్లి ఎస్‌డీఏ అనంత్ ఇంటిలో సోదాలు జరిగాయి. దేవనహళ్లి, హొసకోటేలో భూమంజూరు విభాగంలో పనిచేస్తున్న అనంత్, ఆదాయానికి మించిన ఆస్తులు గడించారనే ఆరోపణలున్నాయి.
దాడులు జరిగిన అధికారులు
● రాజశేఖర్ – తుమకూరు నిర్మితి ప్లానింగ్ డైరెక్టర్
● మంజునాథ్ – సర్వే సూపర్‌వైజర్ మంగళూరు
● రేణుక – అంబేడ్కర్ అభివృద్ధి మండలి అధికారి, విజయపుర
● మురళీ– అదనపు డైరెక్టర్, నగర గ్రామాంతర ప్లానింగ్ డైరెక్టరేట్, బెంగళూరు
● హెచ్‌ఆర్.నటరాజ్– తూనికలు కొలతల ఇన్‌స్పెక్టర్, బెంగళూరు
● అనంత్‌కుమార్– ఎస్‌డీఏ హొసకోటే తాలూకాఫీసు, బెంగళూరు రూరల్
● ఉమాకాంత్– శహపుర తాలూకా కార్యాలయం, యాదగిరి
7 మంది అధికారుల ఇళ్లు, ఆఫీసుల్లో లోకాయుక్త సోదాలు
అవినీతి ఆరోపణలే కారణం
పెద్దమొత్తంలో ఆస్తుల గుర్తింపు

లంచగొండ్లపై ఆకస్మిక దాడి

లంచగొండ్లపై ఆకస్మిక దాడి