‘అజ్ఞాత’ హత్యలు.. జనజీవనానికి సవాళ్లు | - | Sakshi
Sakshi News home page

‘అజ్ఞాత’ హత్యలు.. జనజీవనానికి సవాళ్లు

Dec 1 2025 7:30 AM | Updated on Dec 1 2025 7:30 AM

‘అజ్ఞాత’ హత్యలు.. జనజీవనానికి సవాళ్లు

‘అజ్ఞాత’ హత్యలు.. జనజీవనానికి సవాళ్లు

సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మూడున్నర దశాబ్దాల కాలంపాటు విప్లవోద్యమాలు సాగాయి. సీపీఐ(ఎంఎల్‌) మావోయిస్టు, జనశక్తి పార్టీలు ప్రధానంగా సాయుధ విప్లవ పోరాటాన్ని సాగించాయి. ఈ క్రమంలో వర్గశత్రు నిర్మూలన పేరుతో నక్సలైట్లను అనేక మందిని వివిధ సందర్భాల్లో హత్య చేశారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక మందిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లంటూ నక్సలైట్లు చంపారు. భూస్వాములు, వ్యాపారులు, పోలీసులు, ఆఖరికి మహిళలను కూడా నక్సలైట్లు హతమార్చిన సంఘటనలు అనేకం. అజ్ఞాతంలో ఉండగా.. అప్పటి నక్సలైట్‌ గ్రూపులకు నాయకత్వం వహించిన దళ నాయకులు, డిప్యూటీ దళ నాయకులు ఆనాటి సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తాజాగా సిరిసిల్ల–వేములవాడ పట్టణాల మధ్య అగ్రహారం గుట్టల్లో హత్యకు గురైన బల్లెపు నర్సయ్య అలియాస్‌ సిద్ధన్న అలియాస్‌ బాపురెడ్డి(58) ఉదంతం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది. విప్లవోద్యమాల్లో పని చేసి పోలీసులకు లొంగిపోయి.. అరెస్టయి ఇప్పుడు జనజీవనంలో ఉంటున్న మాజీ నక్సలైట్లలో ఈ ఘటన వణుకు పుట్టిస్తోంది. సిద్ధన్న హత్యోదంతం కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

ప్రతీకారాన్ని శంకించి.. ఊరికి దూరంగా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సిద్ధన్న పదేళ్లపాటు అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీలో పని చేశారు. ఉద్యమ కాలంలో అనేక మందిపై దాడులు, పార్టీ ఆదేశాల మేరకు హత్యలు చేశారు. పీపుల్స్‌వార్‌ పార్టీలోనే ఉంటూ.. పోలీసులకు కోవర్టుగా పని చేస్తున్నారని ఆరుగురిని వట్టిమల్ల–మరిమడ్ల మధ్య, మరో నలుగురిని మానాలతండా వద్ద కట్టేసి కాల్చి చంపిన ఘటనల్లో సిద్ధన్న ఉన్నారు. ఇలా సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో అప్పటి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు చేసిన అనేక హత్య కేసుల్లో సిద్ధన్న నిందితుడు. ఆయన 2004లోనే పోలీసులకు లొంగిపోయారు. ప్రతీకార దాడులుంటాయని భయపడిన సిద్ధన్న.. మూడేళ్లపాటు సొంత ఊరు గండిలచ్చపేట, సిరిసిల్ల ప్రాంతానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లో చాలాకాలం ఉన్నారు. సిద్దిపేటలో భార్యతో కలిసి హోటల్‌ నిర్వహించాడు. ఇక ఏమీ కాదని నిర్ధారణకు వచ్చి సొంత ఊరిలో వ్యవసాయ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 1999 ఏప్రిల్‌ 9న వీర్నపల్లిలో జక్కుల అంజయ్య అనే వ్యక్తిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ పేరిట సిద్ధన్న దళం హత్య చేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా అంజయ్య కొడుకు జక్కుల సంతోష్‌ 26 ఏళ్ల తరువాత సిద్ధన్నను ఇంటర్వ్యూ కోసం పిలిచి అగ్రహారం గుట్టల్లో దారుణంగా హత్య చేశాడు. అంతకుముందు ఓ చానల్‌ ఇంటర్వ్యూలో సిద్ధన్న అంజయ్య హత్యోదంతాన్ని ఉటంకిస్తూ మాట్లాడడంతో సంతోష్‌ అతన్ని గుర్తించి ఈ హత్యకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంతోష్‌ ఒక్కడే సిద్దన్నను హత్య చేయడం గమనార్హం.

మాజీ నక్సలైట్లలో వణుకు..

సిద్ధన్న హత్యోదంతంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా స్థిరపడిన మాజీ నక్సలైట్లలో వణుకు మొదలైంది. అజ్ఞాతంలో అనేక మందిని పార్టీ ఆదేశాల మేరకు హత్య చేసిన వారు ఇప్పుడు సాధారణ జనజీవనం సాగిస్తున్నారు. ఆయుధం చేతిలో ఉండగా.. వ్యక్తిగత కక్షలు ఏమీ లేకపోయినా.. పార్టీ ఆదేశాలను అమలు చేసిన వారు కొందరైతే.. వ్యక్తిగత నిర్ణయాలతో హత్యలు చేసిన సంఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది మాజీలను అజ్ఞాత హత్యలు.. ఇప్పుడు జనజీవనంలో సవాళ్లు విసురుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా వందలాది మంది మాజీ నక్సలైట్లు జనజీవనంలో ఉన్నారు. వ్యాపారాలు చేస్తూ.. వ్యవసాయం చేస్తూ.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తూ సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారు. సిద్ధన్న హత్య ఘటన వారిని ఆలోచనలో పడేసింది. అజ్ఞాతంలో ఉండగా.. దాడులు చేసి కాళ్లు, చేతులు విరిచిన ఘటనలు, హత్య చేసిన సంఘటనల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రతీకార దాడులు జరిగే ప్రమాదముంటుందని ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది సొంత ఊర్లకు దూరంగా ఉంటుండగా.. కొందరు గత్యంతరం లేక సొంత ఊర్లలోనే సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మావోయిస్టు, జనశక్తి పార్టీలో పని చేసి లొంగిపోయిన వారు అనేక మంది ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. అజ్ఞాతంలో ఉండగా నమోదైన పోలీసు కేసులు కోర్టు విచారణలో సాక్ష్యాలు లేక కొట్టుడుపోయాయి. లొంగిపోయిన వారిపై కేసులను పోలీసు అధికారులు ఎత్తేశారు. కొందరిపై వారెంట్లున్నా.. అరెస్ట్‌ చేయకుండా వదిలేశారు. తాజాగా సిద్ధన్న హత్యోదంతంతో మాజీలు ఎవరు కూడా మీడియాకు ఇంటర్వ్యూలివ్వడం కానీ, అజ్ఞాతంలో చేసిన ఘటనల గతాన్ని మళ్లీ తవ్వే ప్రయత్నం కానీ చేయొద్దని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

కౌన్సిలింగ్‌ నిర్వహిస్తాం

సిద్ధన్న హత్యోదంతం నేపథ్యంలో జిల్లాలోని మాజీ నక్సలైట్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎవరి నుంచయినా ప్రమాదం పొంచి ఉంటే పోలీసులను ఆశ్రయించాలి. పంచాయతీ ఎన్నికల తరువాత జిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ వారీగా మాజీ నక్సలైట్లను పిలిచి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తాం. చట్టవ్యతిరేక చర్యలను సహించం. అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. – మహేశ్‌ బి గితే, జిల్లా ఎస్పీ

ప్రతీకార హత్యతో ‘మాజీ’ల్లో వణుకు

కొత్త కోణాన్ని ఆవిష్కరించిన

సిద్ధన్న హత్యోదంతం

మాజీ నక్సలైట్లు అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ స్టేషన్‌ వారీగా మాజీలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తాం

జిల్లా ఎస్పీ మహేశ్‌ బి గితే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement