సర్పంచ్‌కు పోటీ చేస్తే కుల బహిష్కరణ
● సారంపల్లిలో అవగాహన కల్పించిన డీఎస్పీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఆదివారం హేయమైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికలకు రెండో దశ నామినేషన్లు జరుగుతున్న వేళ సర్పంచ్‌గా పోటీ చేద్దామనుకున్న ఓ కుటుంబానికి చుక్కెదురైంది. గ్రామానికి చెందిన ఓ కుల సంఘం నాయకులు తమ కులం నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించారు. అందుకుగాను పోటీచేసే వ్యక్తి నుంచి కుల సంఘానికి రూ.7లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అతడు కాకుండా వేరే వాళ్లు సర్పంచ్‌గా పోటీ చేస్తే కులం నుంచి బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. దీంతో సర్పంచ్‌గా పోటీ చేద్దామనుకున్న వారు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ హేయమైన ఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సామాన్యులు కోరుతున్నారు.
ఎవరైనా పోటీ చేయొచ్చు
రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి స్పష్టం చేశారు. మండలంలోని సారంపల్లిలో కుల సంఘాలతో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. కొన్ని కులాల వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారని తెలిసిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండేపల్లిలో ఏకగ్రీవం కోసం ఒత్తిడి చేసిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి పాల్గొన్నారు.


