
వీపీవో.. మరింత యాక్టివ్!
రుద్రారంలో సివిల్ రైట్స్ డేలో పాల్గొన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నేరాలు జరగకుండా ముందస్తు సమాచారం తెలుసుకోవడం, నేరం జరిగితే సంఘటన ఎలా జరిగింది, ఎవరు బాధ్యులు అన్న విషయం తెలుసుకునేందుకు పోలీసు శాఖ విలేజ్ పోలీస్ ఆఫీసర్లను నియమించింది. పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుళ్లకు ఒక్కొక్కరికీ ఒక్కో గ్రామాన్ని కేటాయించింది. పుష్కర కాలానికిపైగా ఈ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే జిల్లా ఎస్పీగా రాజేశ్ చంద్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ పోలీస్ అధికారి(వీపీవో) వ్యవస్థపై దృష్టి సారించారు. వీపీవోలు మరింత క్రియాశీలకంగా పనిచేసేలా చూస్తున్నారు. ఆయన ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా సిబ్బందితో మాట్లాడుతూ గ్రామాల్లో పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. వీపీవో వద్ద కచ్చితంగా తనకు కేటాయించిన గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాల్సిందేనంటున్నారు. గ్రామాల్లో ఏ సంఘటన జరిగినా క్షణాల్లో తెలిసేలా సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు రెగ్యులర్‌గా వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని, దాన్ని అధికారులకు తెలియజేయాలని పేర్కొంటున్నారు.
గ్రామ వాట్సాప్ గ్రూప్‌లలో...
సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. గ్రామాలు, పార్టీలు, కులాల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రూపులలో జరిగే చాటింగ్‌ల గురించి తెలుసుకోవాలంటే గ్రామ పోలీసు అధికారి ఆ గ్రూపులో యాడ్ అవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీపీవోలు తమ గ్రామ పరిధిలోని వాట్సాప్ గ్రూపులలో మెంబర్లు చేరారు. దీంతో ఆయా గ్రూపులలో జరిగే రాజకీయ సంభాషణలు పోలీసులకు తెలిసిపోతున్నాయి. గ్రామాల్లో ఆధిపత్య పోరులో భాగంగా జరిగే అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. అలాగే గ్రామంలో అన్ని వర్గాల వారితో స్నేహ సంబంధాలు నెరపడం ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏ సంఘటన జరిగినా వెంటనే గ్రామ పోలీసు అధికారికి తెలుస్తుంది. అందుకే అందరితో స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఠాణాలో విలేజ్ హిస్టరీ షీట్
తన గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన గ్రామ పోలీసు అధికారి.. దాన్ని పోలీసు స్టేషన్‌లో ఉన్న విలేజ్ హిస్టరీ షీట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు, కుల, మత సంబంధ వివాదాలు, ఏ వర్గాల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయాలను తప్పనిసరిగా విలేజ్ హిస్టరీ షీట్‌లో పొందుపరచాలని ఎస్పీ సూచిస్తున్నారు. తద్వారా గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలా హిస్టరీ షీట్ నిర్వహించడం వల్ల పండుగల సమయంలో జరిగే వివాదాలు, రాజకీయ గొడవల విషయంలో చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి పోలీసు స్టేషన్‌లో విలేజ్ హిస్టరీ షీట్ రెగ్యులర్‌గా అప్‌డేట్ చేస్తున్నారు.
గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థను
బలోపేతం చేస్తున్న ఎస్పీ
ఏ సంఘటన జరిగినా తెలిసేలా నెట్‌వర్క్
విలేజ్ హిస్టరీ షీట్‌లో
అన్ని వివరాలు నమోదు