
నేటి నుంచి మహిళా సర్పంచ్‌లకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా సర్పంచ్‌లకు సోమవారం నుంచి 25వ తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో సామర్లకోట, బాపట్ల, శ్రీకాళహస్తి విస్తరణ శిక్షణ కేంద్రాలతో పాటు ఆయా కేంద్రాల పరిధిలోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాల ద్వారా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థల పాలకులుగా నిర్వహణ, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విధులు, బాధ్యతలు వంటి అంశాలపై మూడు రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని 71 మంది మహిళా సర్పంచ్‌లకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. అలాగే ఈనెల 26వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 42 మంది మహిళా ఎంపీపీలకు ఈటీసీలో శిక్షణ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.
శ్రేష్ట పరీక్షలో చైతన్యకృష్ణకు 9వ ర్యాంకు
పిఠాపురం: కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించే శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్) పరీక్షలో మండలంలోని నర్సింగపురానికి చెందిన బందిలి చైతన్యకృష్ణ కుమార్ 9వ ర్యాంకు సాధించాడు. శనివారం ఈ ఫలితాలు వెలువడినట్టు బాలుడి తండ్రి ఆదివారం తెలిపారు. దేశ వ్యాప్తంగా అత్యుత్తమ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 9వ తరగతి ప్రవేశాలకు ఎస్సీ బాల, బాలికలకు నిర్వహించిన పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని పలువురు అభినందించారు.
తలుపులమ్మ తల్లి ఆదాయం రూ.7.75 లక్షలు
తుని రూరల్: తలుపులమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి 35వేల మంది భక్తులు వివిధ వాహనాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,63,550, పూజా టికెట్లకు రూ.2,77,160, తలనీలాలకు రూ.27,360, వాహన పూజలకు రూ.5,040, వసతి గదులు, కాటేజీలు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.85,696, విరాళాలు రూ.1,17,012, మొత్తం రూ.7,75,818 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. కాగా దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో సోమవారం ఉదయం 8 గంటలకు హుండీలను లెక్కించనున్నట్టు ఈఓ తెలిపారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు ఉదయం 9.30 గంటలకు విధిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

నేటి నుంచి మహిళా సర్పంచ్‌లకు శిక్షణ