
పిల్లలమర్రి ‘ముస్తాబు’
● 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి సందర్శన
● మహావృక్షం ఖ్యాతిపైపవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఏర్పాట్లు
● విజయనగరం కాలం నాటి ఆలయం.. పురావస్తు మ్యూజియానికి సొబగులు
● తెలంగాణతోపాటు జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారుల సన్నాహాలు
● వెదురు ఆకృతులు, చేనేత చీరలు, మగ్గాలు, బతుకమ్మలు,బోనాల ప్రదర్శన
● గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం.. గురుకులాల విద్యార్థులతో మాటాముచ్చట
● సుమారు వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఈ నెల 16న ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో పాలమూరు ముస్తాబవుతోంది. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని వారు సందర్శించనుండగా.. మహావృక్షం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది.
ఆలయం.. మ్యూజియం.. ఆ తర్వాత పిల్లల మర్రి..
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పురావస్తు మ్యూజియానికి రానున్నారు. ఆ తర్వాత లంబాడాల నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకోనున్నారు. మహా వృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర ఆలయ విశిష్టతతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్‌లను నియమించారు.
గద్వాల, నారాయణపేట చేనేత చీరల ప్రదర్శన..
మన నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజసిద్దంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించనున్నారు. దీంతోపాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్త కళానైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల మర్రి ఆవరణలో 22 మంది అందాల భామల చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టారు. చివరగా గురుకుల విద్యార్థులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
దాదాపు 2 గంటలు.. మూడంచెల బందోబస్తు
మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లకు చెందిన గ్రూప్–2 సభ్యులు 16న సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గాన మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి వద్దకు నేరుగా చేరుకుంటారు. పలు కార్యక్రమాల అనంతరం తిరిగి రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరనున్నట్లు తెలిసింది. ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు మూడంచెల బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు.
రేపు ప్రపంచ సుందరీమణుల రాక
గ్రూప్–2లోని 22 మంది అందగత్తెలు..
ఏర్పాట్లు ఇలా..
మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లు పిల్లల మర్రి పర్యటనను పురస్కరించుకుని పురావస్తు, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊడల మర్రి చుట్టూ మట్టిని చదును చేసి, గ్రాస్ మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ గోడ, ఊడల మర్రి పునరుజ్జీవంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లరతోపాటు సిమెంట్ కుర్చీలకు రంగులు అద్దుతున్నారు. పిల్లలమర్రి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లతోపాటు ప్రత్యేకంగా వాష్‌రూంలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం చేయడంతోపాటు వాటికి నేమ్ బోర్డులు రాయిస్తున్నారు. ఆయా శిల్పాలు ఏ కాలానికి చెందినవి.. ఎవరి హయాంలో తయారు చేశారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వంటి వివరాలు నేమ్ బోర్డులో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సౌండ్ అండ్ లైటింగ్, పారిశుద్ధ్య పనులు చకచకా సాగుతున్నాయి.
మిస్ వరల్డ్–25 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరుగుతున్న పోటీల్లో వందకు పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం వేదికగా మలుచుకుంది. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను గ్రూప్–1, గ్రూప్–2గా విభజించి.. ప్రత్యేక థీమ్, టూరిస్ట్ సర్క్యూట్ల వారీగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పాలమూరులో ప్రఖ్యాతిగాంచిన పిల్లల మర్రిని గ్రూప్–2లోని వివిధ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు శుక్రవారం సందర్శించనున్నారు.

పిల్లలమర్రి ‘ముస్తాబు’