
ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలించాలి
ధరూరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎక్కడా నిల్వ ఉంచుకోవద్దని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని అల్వలపాడులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎంత తరలించారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా డిజిటల్ తేమ మిషన్ ద్వారా తేమ శాతాన్ని పరిశీలించి 17 శాతం రాగానే ధాన్యాన్ని కాంటా వేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ముఖ్యంగా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని సివిల్ సప్లయ్ డీఎంను ఆదేశించారు. ధాన్యం రవాణాకు ఎక్కువ సంఖ్యలో లారీలను సిద్ధం చేసి ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంట వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని, ఆ తర్వాత రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, కాంటా వేసే విషయంలో పారదర్శకంగా తూకాలు వేయాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేసేలా ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, సివిల్ సప్లయ్ డీఎం విమల్, తహశీల్దార్ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.