
ఎన్‌ఎంసీ నిబంధనలు పాటించాలి
జనగామ: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. రాష్ట్రంలోని సర్కారు మెడికల్ కళాశాలల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఎన్‌ఎంసీ షోకాజ్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. మెడికల్ కళాశాల పరిధిలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో పాటు మరింత మెరుగు పరిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది. శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావుతో కలిసి చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి (ఎంసీహెచ్), మెడికల్ కళాశాలను సంగీత సత్యనారాయణ సందర్శించారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఈ ఔషధలో ఎంట్రీ, సేవలపై ఆరా తీశారు. అనంతరం మెడికల్ కళాశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్, జిల్లా ఆస్పత్రి పరిధిలో మరో 72 పడకల సామర్థ్యం పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు డాక్టర్ల ఫేషియల్ అటెండెన్స్ రెండు సార్లు తీసుకోవాలన్నారు. సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు.
థర్డ్ ఇయర్ బోధనకు తాత్కాలిక భవనం
వైద్య కళాశాల మూడవ సంవత్సరం తరగతి బోధనకు ప్రస్తుతం ఉన్న రెండు లెక్చర్ గ్యాలరీల సమీపంలో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎస్ట్‌మేషన్ వేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎంఐడీసీ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో వేగం పెరగాలన్నారు. కాగా కళాశాల చుట్టూ పవర్‌గ్రిడ్ విద్యుత్ తీగలు ఉండటంతో ఇంటర్నెట్ సమస్య వేధిస్తోందని కమిషనర్‌కు వైద్యులు వివరించారు. సమీక్షలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్‌దాస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లిఖార్జున్‌రావు, ఎంసీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, ప్రొఫెసర్, మెడిసిన్ డాక్టర్ శంకర్, వైద్యులు అన్వర్, అనురాధ, శంకర్, కమలహాసన్, టీఎస్‌ఎంఐడీసీ కేఎస్‌కే ప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీధర్‌రెడ్డి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
థర్డ్ ఇయర్ కోసం తాత్కాలిక భవనం
మరో మూడు ఆపరేషన్
థియేటర్లు సిద్ధం చేయండి
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ