యెమెన్లోని ఏడెన్ నగరంలో ఉన్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ భవనంపై హౌతీలు గురువారం దాడులకు పాల్పడ్డారు. మాషిక్ ప్యాలెస్ వద్ద రెండు, సెక్యూరిటీ గేట్ వద్ద మరో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కనీసం ఆరు పేలుళ్లు సంభవించాయని ఓ అధికారి చెప్పారు.
ఘటనల్లో ఇద్దరు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. దాడులకు తమదే బాధ్యతంటూ హౌతీలు ప్రకటించుకున్నారు. క్షిపణులు, డ్రోన్ల దాడులతో భీతిల్లిన ప్రజలు, ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.
ఈ దాడుల సమయంలో యెమెన్ ప్రధాని షాయా మొహ్సిన్ అల్-జిందానీతో పాటు ప్రభుత్వంలోని నేతలంతా భవనంలో ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ ప్రధాన మంత్రితో పాటు నేతలంతా క్షేమంగా బయటపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అండగా ఉండగా, హౌతీలను ఇరాన్ ప్రోత్సహిస్తుండటం తెల్సిందే.
ఇలా ఉండగా, హౌతీలు గురువారం ఉదయం మెదినా ప్రావిన్స్సైకి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిని మధ్యలోనే అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జెడ్డా విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు కావడమో లేక ఆలస్యం కావడమో జరిగింది.
అయితే, ఈ దాడితో తమకు సంబంధం లేదని హౌతీలు ప్రకటించారు. సౌదీలోని పవిత్ర మక్కా, మెదినాలపై తాము దాడులు చేయబోమని వీరు ఇదివరకే ప్రకటించారు. అయితే, ప్రధాన మిలటరీ స్థావరమున్న ఖమిస్ వద్ద డ్రోన్ను ధ్వంసం చేసినట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.


