
మనుషులుగా లెక్కిస్తే కోట్లలో
ముద్దగా చేసి చూస్తే మాత్రం తక్కువే!
యూఎస్ సెంట్రల్ పార్క్‌లో ‘మీట్‌బాల్’గా ప్రపంచ జనాభా
గ్రాండ్ కాన్యన్‌లో ‘మీట్ కోన్’గా యుగాల జనాభా
గణిత శాస్త్రవేత్తల గ్రాఫిక్ అంచనాలు
ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుంది? ఏమిటీ పిచ్చి ప్రశ్న?! పిచ్చి ప్రశ్న కాదు. కొందరు శాస్త్రవేత్తలకు వచ్చిన ఆలోచన! వారి ఆలోచనకు తాజాగా ఒక గణిత శాస్త్రవేత్త అంచనా వేసి పెట్టారు. ఆయన లెక్క ప్రకారం – ప్రస్తుత ప్రపంచ జనాభాను మొత్తం ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుందో తెలుసా? మీరు అనుకున్న దాని కంటే చాలా చిన్నదిగా! ఇదేం జవాబు? లెక్కా పక్కా ఉండక్కర్లేదా? ఉంది.. లెక్క ఉంది.. పక్కాగా కూడా ఉంది.
‘రెడిట్’ ఇంటర్నెట్ ఫోరమ్‌లో ‘కివి2703’ అనే అకౌంట్‌లో ఒక అజ్ఞాత గణితశాస్త్ర నిపుణుడు ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దగా (మీట్‌బాల్) గా చేస్తే 0.6 మైళ్లు.. అంటే కిలోమీటరు వెడల్పు లోపలే ఉంటుందని అంచనా వేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, న్యూయార్క్‌లో 1250 అడుగుల ఎత్తయిన ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’కు రెండున్నర రెట్లు, లేదా పారిస్‌లో 1063 అడుగుల ఐఫిల్ టవర్‌కు మూడింతలకు పైగా ఎత్తులో ఆ మీట్‌బాల్ ఉంటుందని ఆయన లెక్క తేల్చారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
శాస్త్రవేత్త గారూ.. మీరు ఓకేనా ?
గణిత శాస్త్రవేత్త సమాధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. 788 కోట్ల జనాభాను ముద్దగా చేస్తే ‘ఇంతేనా ఉండేది.. ఇంత చిన్నాగానా’ అని ఒక నెట్ యూజర్ ఆశ్చర్యపోతే, ‘ఇంతకన్నా పెద్దదిగా ఉంటుంది అనుకున్నానే..’ అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు. మరొకరైతే, ‘మీరు బాగానే ఉన్నారా సైంటిస్టు గారూ?’ అని గణిత శాస్త్రవేత్తపై జోక్ వేశారు.
గతంలో – మానవజాతి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా అంతటిని కలిపి అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ లోయలోకి చేరిస్తే ఎంత పరిమాణంలో ఉంటుందో ఒక సైన్స్ యూట్యూబ్ చానల్ వేసిన గ్రాఫిక్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ గణిత శాస్త్రవేత్త తాజాగా తన లెక్కలు వేశారట. మానవులందరూ ఒక చోట శంఖం ఆకారంలో కుప్పగా ఆ వీడియోలో ఉండగా, అజ్ఞాత శాస్త్రవేత్త అదే ప్రయోగాన్ని ఒక గుండ్రటి మాంసపు ముద్దగా చేసి చూపించారు.
సెంట్రల్ పార్క్‌లో ‘మీట్‌బాల్’
మానవ ‘మీట్‌బాల్’ పరిమాణాన్ని లెక్కంచటానికి అజ్ఞాత గణితవేత్త కొన్ని ప్రాథమిక అంచనాలను తీసుకున్నారు. ప్రస్తుత ప్రపంచ జనాభాను 788 కోట్లుగా వేసుకున్నారు. ఒక్కో మనిషి సగటు బరువును 62 కిలోలుగా అనుకున్నారు. మానవ శరీరాల సాంద్రతను క్యూబిక్ మీటరుకు 985 కిలోగ్రాములుగా లెక్కించారు. క్యూబిక్ మీటరు అంటే ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు ఎత్తు ఉన్న ప్రదేశం.
ఈ అంచనాల నుంచి ‘హ్యూమన్ మీట్‌బాల్’ ఎంత పరిమాణంలో ఉంటుందో లెక్కించారు. ఆ లెక్క ప్రకారం భూమి పైన ఉన్న 788 కోట్ల మందిని ఒక చక్కటి బంకతో కలిపి ముద్ద చేస్తే ఇంచుమించు ఒక కిలోమీటరు వెడల్పులో గోళాకారం తయారైంది. ఆ ఎర్రటి మాంసపు బంతిని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ మధ్యలో ఉంచితే ఎలా ఉంటుందో కూడా ఆయన ఒక విజువల్ సృష్టించారు.
గ్రాండ్ కాన్యన్‌లో ‘మీట్ కోన్’
అమెరికాలోని సుప్రసిద్ధ యూట్యూబ్ చానళ్లలో ‘వీసాస్’ ఒకటి. విద్య, సైన్స్, గణితం వంటి అంశాలపై 40 ఏళ్ల మైకేల్ స్టీవెన్స్ వీడియోలు చేస్తుంటాడు. ఈ యూట్యూబ్ చానల్‌లో గతంలో పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి మానవ మీట్‌బాల్‌ను అంచనా వెయ్యటానికి స్ఫూర్తి పొందారు రెడిట్ అజ్ఞాత గణిత శాస్త్రవేత్త.
ఆరిజోనా రాష్ట్రంలో కొలరాడో నది ఒడ్డున ఉన్న గ్రాండ్ కాన్యన్ లోయలో... సృష్టి ఆరంభం నుంచి ఉన్న మానవ జనాభానంతా (సుమారు 10,600 కోట్లు) పోస్తే, ఆ లోయలో 15 కుప్పలు తయారైనట్లు ‘వీసాస్’ ప్రెజెంటర్ మైకేల్ స్టీవెన్స్ గ్రాఫిక్స్‌తో చేసిన వీడియో అది. అంతమంది జనాభాను ఒక చోట చేర్చినా కూడా ఆ లోయ ఇంకా ఖాళీగానే ఉండటం విశేషం అని స్టీవెన్స్ అంటారు.
446 కి.మీ. పొడవు, కొన్నిచోట్ల 1.6 కి.మీ. వరకు లోతు ఉన్న ఆ లోయలో.. కెనడాకు చెందిన గ్రాఫిక్ డేటా విజువలైజేషన్ బ్లాగర్ ఇస్మాయిల్ శాంటోస్ బ్రాల్ట్ జనాభాను నింపారు. మనిషి సగటు బరువును 70 కిలోలుగా వేసుకుని, 49 కోట్ల టన్నుల బరువుతో 700 కోట్ల మంది జనాభాను ఒక కుప్పగా చేరిస్తే అదే పరిమాణంలో 15 కుప్పలు తయారయ్యాయి. ఈ వీడియో ప్రేరణతోనే ఇప్పుడీ రెడిట్ శాస్త్రవేత్త ప్రస్తుత జనాభాతో మీట్‌బాల్‌ను సృష్టించారు.