Russia-Ukraine War: యుద్ధం అంటే బాధ, రక్తపాతం.. దాడి చేయం.. కానీ: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

Ukraine President Volodymyr Zelensky Speech Goes Viral Heart Breaking - Sakshi

Russia-Ukraine War: ‘‘మా గొంతుకను వినండి... ఉక్రెయిన్‌ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్‌ అధికారులు శాంతిని కాంక్షిస్తున్నారు. మాకు యుద్ధం ఏమాత్రం అవసరం లేదు’’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ జాతిని, రష్యా ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కాగా గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌పై కన్నెర్ర చేస్తున్న రష్యా.. గురువారం యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాల ప్రముఖులు రష్యా చర్యను ఖండించారు. తాజా పరిణామాల వల్ల తీవ్ర నష్టం చవిచూడాల్సి ఉంటుందని అగ్రరాజ్యం హెచ్చరించింది. ఈ పరిణామాల క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విడుదల చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో భాగంగా తాము యుద్ధం కోరుకోవడం లేదని, అయితే తమను తాము రక్షించుకునే క్రమంలో ప్రతిదాడి చేస్తామని స్పష్టం చేశారు.

‘‘యుద్ధం అంటే బాధ, బురదలో కూరుకుపోవడం, రక్తపాతం, వేలాది మంది మరణాలు. మాపై దాడి చేయడం ద్వారా మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మేము మాత్రం యుద్ధం కోరుకోవడం లేదు’’ అని రష్యన్‌ భాషలో ప్రసంగించారు. ‘‘మనం శత్రువులం కాదు.. అయితే ఆత్మరక్షణలో భాగంగా మేము కూడా ప్రతిదాడి చేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు అంతర్జాతీయ నిపుణులు జెలెన్‌స్కీ వ్యవహార శైలిని ప్రశంసిస్తున్నారు.

ఆయన ప్రసంగం హృదయాలను కదిలించిందని, శాంతిని కోరుకునే తత్వంతో చరిత్రలో నిలిచిపోతారంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. #StandWithUkraine అంటూ ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు బ్రిటన్‌, ఫ్యాన్స్‌ ఉక్రెయిన్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఇదిలా ఉండగా తాను ప్రపంచదేశాధినేతలతో చర్చలు జరుపుతున్నానన్న జెలెన్‌స్కీ... ప్రపంచం తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి: ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: పుతిన్‌ వార్నింగ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top