Japan Killing Stone: ఆ రాయిని తాకిన అందరూ చనిపోయారు.. ఈ మధ్యే..

Japans Killing Stone Splits in Two - Sakshi

అది జపాన్‌లోని టోక్యోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం.. అక్కడి కొండల మధ్యలో ఓ రాయి.. ఏముందీ కొండల్లో ఉండేవి రాళ్లే కదా అంటారా.. కానీ ఇది చాలా స్పెషల్‌. ఇప్పుడు అప్పుడు అని కాదు.. దాదాపు వెయ్యేళ్లనాటి చరిత్ర ముడిపడి ఉన్న ఈ రాయి మాత్రం జపాన్‌లో జనాలను వణికించేస్తోంది. రాయి ఏమిటి, వణికించడం ఏమిటో తెలుసా? 

జపాన్‌ పురాణాల్లోని ఓ గాథ ఈ రాయి ఏమిటో చెప్తుంది. 1107–1123 సంవత్సరాల మధ్య జపాన్‌ను పాలించిన టోబా చక్రవర్తిని కొందరు కుట్ర చేసి చంపేశారు. అందులో ముఖ్యమైనది టమామో నోమీ అనే ఓ మహిళా మంత్రగత్తె. అయితే చక్రవర్తి మరణించాక ఓ యుద్ధవీరుడు టమామోను చంపేయగా.. వెంటనే ఆమె మృతదేహం ఓ పెద్ద రాయిగా మారిపోయిందట. ఆ రాయిని ఎవరు తాకినా చనిపోయేవారట. అప్పటి నుంచీ ఆ రాయిని ‘సెషో సెకి (కిల్లింగ్‌ స్టోన్‌) అని పిలవడం మొదలుపెట్టారు. మంత్రగత్తె ఆత్మ అందులోనే బందీ అయి ఉందని భావించేవారు.  ఈ రాయి ఈ మధ్యే రెండుగా విరిగిపోయింది దీంతో ఆ దెయ్యపు మంత్రగత్తె బయటికి వచ్చేసిందంటూ.. అక్కడి జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇది అక్కడి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వెయ్యేళ్ల తర్వాత దెయ్యం బయటికి వచ్చేసిందని కొందరు అంటుంటే.. రాయి మధ్యలోంచి ఏదో బయటికి వచ్చినట్టుగా పగిలిందంటూ మరికొందరు సాక్ష్యం చూపుతున్నారు. ఏదో కీడు జరుగుతుందేమో అంటూ ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాయికి కొన్నేళ్ల కిందే పగుళ్లు వచ్చాయని, ఇటీవలి భారీ వర్షాలతో నీటి ప్రవాహం దెబ్బకు రాయి విరిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చిత్రమేమిటంటే.. ఈ రాయి ఉన్న చోటు ఓ పర్యాటక ప్రాంతం. ఇన్నాళ్లూ జనం బాగానే పోటెత్తేవారు. రాయి విరిగిందని తెలిసినప్పటి నుంచి అటువైపు చూడటమే మానేశారు.  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top