Pc: Reuters
నల్ల సముద్రంలో నౌకలపై మరోసారి డ్రోన్ దాడులు జరిగాయి. తమ తీరానికి సమీపంలో మంగళవారం రెండు నౌకలపై దాడి జరిగినట్లు బల్గేరియా ప్రధాని రుమెన్ రడెవ్ తెలిపారు. ఇందులో తీవ్రంగా దెబ్బతిన్న ఒక ఓడ మునిగిపోగా, అందులోని 11 మంది సిబ్బంది గల్లంతయ్యార్నారు.
మరో నౌకలోని మొత్తం 15 మంది సిబ్బందిని కాపాడామన్నారు. మాల్టా జెండా కలిగిన ఉక్రెయిన్‌కు చెందిన చెల్సియా3 అనే నౌకను మూడు డ్రోన్లు ఢీకొట్టాయని చెప్పారు. నౌక దెబ్బతినగా అందులోని మొత్తం 15 మంది సిబ్బందిని కాపాడామన్నారు. వీరిలో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు.
సిబ్బందిలో ఏడుగురు ఉక్రెయిన్‌కు, 8 మంది అజెర్‌బైజాన్‌కు చెందిన వారన్నారు. అదేవిధంగా, డ్రోన్ దాడి కారణంగా తమ తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయిన గినియా బిస్సౌ జెండా కలిగిన నౌక హెచ్‌ఎస్ డిగి్నటీలోని ఐదుగురిని రక్షించినట్లు ప్రధాని రడెవ్ చెప్పారు. అందులోని సిరియా, ఈజిప్టులకు చెందిన మరో 11 మంది జాడ కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతోందన్నారు.
ఎంతో కీలకమైన సరుకు రవాణా నౌకలపై ఇలాంటి దాడులు ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ దాడులకు కారణం ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. అయినప్పటికీ అందరూ రష్యావైపే వేలెత్తి చూపుతున్నారని ప్రధాని రుమెన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులతో రష్యా పౌరుల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ఆరోపించారు.
వారం క్రితం బల్గేరియా తీరానికి సమీపంలో రెండు వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. టోగో జెండా కలిగిన ఓడ మునిగిపోగా, పలావు జెండా కలిగిన ఓడలోని 18 మంది సిబ్బందిని బల్గేరియా కాపాడింది. ఈ దాడులతో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అంతకుముందు, రొమేనియా తీరంలో జరిగిన మరో డ్రోన్‌దాడిలో తుర్కియేకు చెందిన మొక్కజొన్నలతో వెళ్తున్న నౌక మంటలు అంటుకుని, మునిగిపోయింది. కాగా, తాజా దాడిపై రష్యా స్పందించలేదు.


