12 దేశాల భాగస్వామ్యంతో... ఐపీఈఎఫ్‌ | 12 Countries To Join Indo-Pacific Economic Framework | Sakshi
Sakshi News home page

12 దేశాల భాగస్వామ్యంతో... ఐపీఈఎఫ్‌

May 24 2022 6:09 AM | Updated on May 24 2022 6:09 AM

12 Countries To Join Indo-Pacific Economic Framework - Sakshi

టోక్యోలో కిషిడా, బైడెన్‌లతో మోదీ

టోక్యో: కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాల నుంచి బయట పడి ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు చెక్‌ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్‌ దేశాల మధ్య ఇండో పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈఎఫ్‌) పేరిట సరికొత్త వర్తక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ పీఎం ఫుమియో కిషిడాతో కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఐపీఈఎఫ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై భాగస్వాములు. భావి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ఐపీఈఎఫ్‌ దోహదపడుతుందంటూ ఈ 12 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ, ‘‘21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను శాసించేది ఇండో పసిఫిక్‌ ప్రాంతమే. సగానికి పైగా ప్రపంచ జనాభాకు, 60 శాతానికి పైగా ప్రపంచ జీడీపీకి ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే తాజా ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యముంది’’ అని అన్నారు. ఐపీఈఎఫ్‌లో మున్ముందు మరిన్ని దేశాలు భాగస్వాములు అవుతాయన్నారు. సరఫరా వ్యవస్థ, డిజిటల్‌ వర్తకం, స్వచ్ఛ ఇంధనం, ఉద్యోగుల భద్రత, అవినీతి నిరోధం తదితర రంగాల్లో సభ్య దేశాలన్నీ మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఐపీఈఎఫ్‌ వీలు కల్పిస్తుందని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని స్వరూప స్వభావాలపై అక్టోబర్‌కల్లా స్పష్టత వస్తుందని తెలిపింది. చైనాను రెచ్చగొట్టొద్దనే ఉద్దేశంతో ప్రస్తుతానికి తైవాన్‌ను ఐపీఈఎఫ్‌లో  భాగస్వామిగా చేసుకోకపోయినా ఆ దేశంతో సన్నిహిత ద్వైపాక్షిక ఆర్థిక బంధం కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది.  

మూడు ‘టి’లే మూలస్తంభాలు: మోదీ
ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో–పసిఫిక్‌ను ప్రధాన చోదక శక్తిగా మార్చేందుకు ఐపీఈఎఫ్‌ భాగస్వామిగా భారత్‌ కృషి చేస్తుందని మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలన్న సభ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు, ఆర్థిక సవాళ్లను అధిగమించాలన్న సమిష్టి సంకల్పానికి ఐపీఈఎఫ్‌ ప్రతిరూపమన్నారు. ఇలాంటి భాగస్వామ్యానికి రూపమిచ్చినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలన్నారు. ‘‘నిర్మాణ, ఆర్థిక కార్యకలాపాలకు, అంతర్జాతీయ వర్తక, పెట్టుబడులకు ఇండో పసిఫిక్‌ ప్రాంతం ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో వర్తక కార్యకలాపాలకు భారత్‌ ప్రధాన కేంద్రం. ఇందుకు చరిత్రే సాక్షి’’ అని చెప్పారు. ప్రపంచంలోనే అతి పురాతన వాణిజ్య నౌకాశ్రయం గుజరాత్‌లోని లోథాల్‌లో ఉందని గుర్తు చేశారు. ఒప్పందంలో భాగంగా సభ్య దేశాల మధ్య నెలకొనబోయే కీలక సరఫరా వ్యవస్థలకు ట్రస్ట్‌ (నమ్మకం), ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత), టైమ్లీనెస్‌ (సమయపాలన) అనే మూడు ‘టి’లు మూల స్తంభాలుగా నిలవాలని పిలుపునిచ్చారు.

విఫల యత్నమే: చైనా
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్‌ భాగస్వామ్యంపై చైనా మరోసారి అక్కసు వెలిగక్కింది. 12 ఇండో పసిఫిక్‌ దేశాల భాగస్వామ్యంతో తాజాగా తెరపైకి వచ్చిన ఐపీఈఎఫ్‌ విఫలయత్నంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పింది. వీటి ముసుగులో ఇండో పసిఫిక్‌లో సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. వాటిని అడ్డుకోవాలని ఇండో పసిఫిక్‌ దేశాలకు పిలుపునిచ్చింది.  

భారత్‌ చలో.. భారత్‌ సే జుడో
జపాన్‌ ఎన్నారైలకు మోదీ పిలుపు
భారత్, జపాన్‌ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ అన్నారు. భారత అభివృద్ధి యాత్రలో జపాన్‌ పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. ముంబై–అహ్మదాబాద్‌ హై స్పీడ్‌ రైల్, ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్, డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్ల వంటివి ఇరు దేశాల పరస్పర సహకారానికి నిదర్శనాలని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జపాన్‌లోని ఎన్నారైలతో టోక్యోలో ఆయన భేటీ అయ్యారు. ‘భారత్‌ చలో, భారత్‌ సే జుడో’ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి సవాళ్లను అధిగమించేందుకు బుద్ధుని బాటే ఆదర్శమన్నారు.  ప్రతి భారతీయుడూ జీవితంలో ఒక్కసారైనా జపాన్‌ సందర్శించాలని అప్పట్లో స్వామి వివేకానంద అన్నారు. ప్రతి జపాన్‌ పౌరుడూ ఒక్కసారైనా భారత్‌ సందర్శించాలని నేనంటున్నా’’ అని చెప్పారు. మంగళవారం ఆయన క్వాడ్‌ శిఖరాగ్రంలో పాల్గొనడంతో క్వాడ్‌  దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement