
పెద్దల ఆంక్షలనే ఇనుప చట్రాల కింద మరో ప్రేమ జంట నలిగిపోయింది. మనసిచ్చి పుచ్చుకుని.. ఊసులు చెప్పుకొని.. భవిష్యత్తు గురించి ఎన్నో బాసలు చేసుకున్న ఆ ప్రేమజంట పెద్దలను ఒప్పించలేక.. విడిపోయి బతకలేక.. రైలు పట్టాలపై తలపెట్టి.. తమ జ్ఞాపకాలను తలపోసుకుంటూ.. కన్నీరు నిండిన కళ్లతో ఒకరినొకరు కడసారి చూసుకుంటూ మృత్యువును ఆహ్వానించారు.
గుంటూరు: క్షణికావేశంలో ప్రేమజంట తీసుకున్న తొందరపాటు నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన సంఘటన చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివ రాల్లోకి వెళితే.. మండల పరిధిలోని శలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్ (20), పులి త్రివేణి(19)లు బుధవారం సంగం జాగర్లమూడి స్టేషన్ పరిధిలోని సుద్దపల్లి గ్రామ పరిధిలోని రైల్వే గేట్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఇరువురు శలపాడు గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇరుపక్షాల పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పులి త్రివేణి సోమవారం అదృశ్యం కావటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెనాలిలోని ఏఎస్‌ఎన్ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న త్రివేణి సోమవారం కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇదే ప్రాంతానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్‌తో కలిసి వెళ్లినట్లు త్రివేణి తల్లిదండ్రులకు ఆమె స్నేహితురాలు చెప్పటంతో వీరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఐటీఐ వరకు చదివిన శ్రీకాంత్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ పదిరోజుల క్రితం ఇంటి నుంచి కొంత నగదు తీసుకొని వెళ్లినట్లు సమాచారం. ఇరువురు శ్రీశైలం, తిరుపతి వెళ్లి ఉంటారని అనుమానించారు.
అయితే బుధవారం ఉదయం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను రైల్వే గ్యాంగ్‌మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గుంటూరు – తెనాలి రైలు మార్గంలో ట్రాక్‌పై ఇరువురు మృతదేహాలు ఛిద్రమై గుర్తు పట్ట లేని విధంగా శరీర భాగాలు ముక్కలుగా తెగిపడిపోయాయి. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతురాలు తమ కుమార్తె అని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.