ChatGPT: అన్నింటికీ సమాధానాలు.. ‘ఛాట్‌బోట్‌జీపీటీ’ ఎందుకు? ఏమిటి? ఎలా?

What Is ChatGPT That Attracts Youth Interesting Facts - Sakshi

ఛలో ఛాట్‌బోట్‌ వరల్డ్‌

శోధించి సాధించు... అన్నారు. ఆ సాధనలో అద్భుతాలు సాధిస్తే ఎంత బాగుంటుంది! కృత్రిమ మేధస్సుతో కూడిన రకరకాల ఛాట్‌బోట్‌లు ఆ అద్భుతాలకు నిలయం కానున్నాయి. యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్న ఛాట్‌బోట్‌ ‘ఛాట్‌బోట్‌జీపీటీ’ ఎందుకు? ఏమిటి? ఎలా?

జనరేటివ్‌ ప్రీ–ట్రైన్‌డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌
జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి జటిలమైన ప్రశ్నలకు సమాధానం వరకు, మ్యూజిక్‌ కంపోజింగ్‌ నుంచి పాటలు రాయడం వరకు ఎన్నో విషయాలలో ఉపకరించే ఏఐ ఆధారిత ఛాట్‌బోట్‌ల గురించి యూత్‌ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇటీవల కాలంలో యూత్‌ ‘చాట్‌జీపీటీ’ (జనరేటివ్‌ ప్రీ–ట్రైన్‌డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌) గురించి అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది.

దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ ‘గూగుల్‌’ను ఈ ‘ఛాట్‌జీపీటీ’ సవాలు చేయగలదని కొందరు, అధిగమించి అగ్రస్థానంలో నిలవనుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలలో నిజానిజాల మాట ఎలా ఉన్నా ‘ఆసక్తి’ మాత్రం నిజం. ఇంతకీ ఏమిటి దీని ప్రత్యేకత? కంటెంట్‌ క్రియేషన్‌లో ఉపయోగపడుతుంది.

ఏదైనా క్రియేటివ్‌ ఆర్టికల్‌ రఫ్‌గా రాస్తే మంచి మంచి పదాలు, శైలితో సొబగులు అద్దగలదు. ఏదైనా అంశానికి సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్నా డేటాను క్రమపద్ధతిలోకి తీసుకురాగలదు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ రాయగలదు. మనుషుల సంభాషణ శైలిని సహజంగా అనుకరించగలదు.

తనదైన శైలిలో
ఏదైనా విషయం గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు ‘ఇదిగో ఈ లింకులు ఉన్నాయి’ అన్నట్లుగా చూపుతుంది. ‘ఛాట్‌జీపీటీ’ మాత్రం లింక్‌లతో పాటు తనదైన శైలిలో విషయ వివరణ ఇస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జాత్యహంకార, సెక్సిస్ట్‌ ప్రాంప్ట్‌లను ‘చాట్‌జీపీటీ’ డిస్‌మిస్‌ చేస్తుంది.

శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ ‘ఛాట్‌జీపీటీ’ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించింది. కంప్యూటర్‌ సైంటిస్టు శామ్‌ఆల్ట్‌మన్, ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్వెస్టర్, ప్రోగ్రామర్‌ ఇల్యా సట్స్‌కెర్వర్, ఎలాన్‌ మస్క్‌... లాంటివారు ఈ ప్రాజెక్ట్‌ వెనుక ఉన్న ప్రముఖులు. ఆ తర్వాత కాలంలో మస్క్‌ తప్పుకున్నారు.

‘ఫ్రెండ్లీ ఏఐ’
మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థ దీనిలో పెట్టుబడి పెట్టడం విశేషంగా మారి అంచనాలు మరింతగా పెంచింది. ‘ఫ్రెండ్లీ ఏఐ’ ని దృష్టిలో పెట్టుకొని ఏఐ రంగంలో లోతైన పరిశోధనలు చేస్తోంది ఛాట్‌జీపీటీ. వ్యక్తిగత సంభాషణ, సోషల్‌మీడియాలో అభిప్రాయాల కలబోత అనేది ఒక ఎత్తు అయితే, ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ ‘ది గార్డియన్‌’లాంటి పత్రికలు ‘ది బెస్ట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఛాట్‌బోట్‌’ అంటూ ‘ఛాట్‌జీపీటీ’ని ప్రశంసించడం మరో ఎత్తు.

మరోవైపు టెక్నాటజీ రైటర్‌ డాన్‌ గ్లిమోర్‌ ప్రయోగాత్మకంగా పరీక్షించి ‘ఛాట్‌జీపీటీ’ని ప్రశంసించారు. అంతా బాగానే ఉందిగానీ, ‘ఛాట్‌జీపీటీ’కి పరిమితులు, లోపాలు లేవా? అనే ప్రశ్నకు ‘నో’ అనే జవాబు మాత్రం వినిపించదు. అప్పుడప్పుడూ తప్పుడు సమన్వయాలు, పునరావృతం అయ్యే పదాలు, తప్పుడు సమాధానాలు కనిపించవచ్చు. కొన్ని సంఘటనల గురించి పరిమిత సమాచారానికి మాత్రమే పరిమితం కావచ్చు.

గూగుల్‌ను పక్కకు తప్పించగలదా?
కొందరు ప్రముఖుల గురించి ఏమీ చెప్పలేకపోవచ్చు... ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ‘ఓపెన్‌ ఏఐ’ ఈ పరిమితులు, లోపాలను దాచాలనుకోవడం లేదు. యూజర్‌లు లోపాలను ఎత్తిచూపవచ్చు. సూచనలు ఇవ్వవచ్చు. వాటిని ఆహ్వానిస్తోంది ఛాట్‌జీపీటీ.

ప్రయోగదశ కాలంలో పది లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ‘ఛాట్‌జీపీటీ’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్‌ను పక్కకు తప్పించగలదా? యువతరం అంచనాలకు న్యాయం చేయగలదా?... మొదలైన ప్రశ్నలకు స్పష్టత వచ్చేందుకు ఎంతో కాలం పట్టేటట్లు లేదు.

చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్‌ అయ్యింది!
Captain Shiva Chouhan: సియాచిన్‌ పై వీర వనిత

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top