శిష్టమైన, విశిష్టమైన కవిత్వ ఆవిష్కరణ వేటూరి అభివ్యక్తి | Special Story On Writter Veturi Sundararama Murthy, Know Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

శిష్టమైన, విశిష్టమైన కవిత్వ ఆవిష్కరణ వేటూరి అభివ్యక్తి

Published Mon, Jan 29 2024 6:00 AM

Special Story On Writter Veturi Sundararama Murthy - Sakshi

అత్యంత ప్రతిభావంతమైన కవి వేటూరి సుందరరామ్మూర్తి. తెలుగు సినిమా‌ పాటలో కావ్య కవిత్వాన్ని పండించారు వేటూరి. తెలుగు సినిమా పాటల్లో వేటూరి‌ రాసి పెట్టినంత గొప్ప కవిత్వం మరొకరు రాయలేదు. వేటూరి కాలానికి తెలుగు సినిమాలో సముద్రాల, మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, దాశరథి, నారాయణ రెడ్డి వంటి గొప్పకవులున్నారు. కానీ సినిమా పాటకు సంబంధించినంత వరకూ వేటూరి అందరికన్నా గొప్పకవి. ఇప్పటికీ వేటూరి అంత గొప్పకవి తెలుగు సినిమాలో రాలేదు.

మొత్తం దక్షిణాది సినిమాలో గొప్పకవి తమిళ్ష్ కణ్ణదాసన్. అంత కణ్ణదాసన్‌ను మరిపించగలిగింది‌ వేటూరి మాత్రమే. వేటూరి రాసిన "మానసవీణ మధుగీతం..." కణ్ణదాసన్ కూడా రాయలేరేమో?తొలిరోజుల్లో పంతులమ్మ చిత్రంలో వేటూరి‌‌ రాసిన‌ "మానస వీణా‌ మధు గీతం" పాట నుంచీ ఆయన చేసిన కవిత్వ ఆవిష్కరణ ప్రశస్తమైంది. "కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమని, తడిసే దాకా‌ అనుకోలేదు తీరని‌ దాహమని" అని‌ ఆయనన్నది అంతకు‌‌ ముందు తెలుగు సినిమా‌కు లేని వన్నె.

అడవి రాముడు సినిమాలో‌ "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" పాట సీసపద్యం. ఆ పాటలో పైట లేని ఆమెతో "నా పాట నీ పైట కావాలి" అన్నారు వేటూరి. ఆ సినిమాలో‌ని‌ "కుహు‌ కుహు కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి..." పదాల‌ పొందికలోనూ, భావుకతలోనూ ఎంతో‌ బావుండే పాట. మల్లెపూవు సినిమాలో వేటూరి రాసిన "ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో" పాటా, ఆ పాటలో వేశ్యల దుస్థితిపై "ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో/ ఏ ఖర్మం ఈ గాయం చేసిందో" అని అన్నదీ వేటూరి మాత్రమే చెయ్యగలిగింది. ఇలాంటి‌ సందర్భానికి మానవుడు దానవుడు సినిమాలో నారాయణ రెడ్డి రాసిన‌ పాట ఈ పాటంత సాంద్రంగానూ, ఇంత పదునుగానూ, గొప్పగానూ లేదు. ఈ సందర్భానికి ముందుగా ప్యాసా హిందీ సినిమాలో సాహిర్ లూధియాన్‌వీ రచన "ఏ కూచే ఏ నీలామ్ ఘర్ దిల్ కషీకే" వచ్చింది. దానికన్నా భావం, వాడి, శైలి, శయ్యల పరంగా వేటూరి రచనే గొప్పది. ఝుమ్మంది‌‌ నాదం సై అంది పాదం" పాట తొలి రోజుల్లోనే వేటూరి గొప్పకవి అవడానికి నిదర్శనమైంది. ఈ పాట సందర్భంలోనూ హిందీ సినిమా సర్గమ్ పాట కన్నా వేటూరి రచనే మేలైంది. 

"శారదా వీణా రాగచంద్రికా‌ పులకిత శారద రాత్రము నారద నీరద మహతి‌‌ నినాద గమకిత శ్రావణ‌ గీతము" అని అనడం‌‌ సినిమా పాటలో‌నే కాదు మొత్తం‌ తెలుగు‌ సాహిత్యం‌లోనూ‌ మహోన్నతమే."తత్త్వ సాధనకు సత్య శోధనకు‌‌ సంగీతమే‌ ప్రాణము" అని‌ అన్నప్పుడూ "అద్వైత సిద్ధికి‌ అమరత్వ‌లబ్దికి గానమె సోపానము" అనీ‌ అన్నప్పుడు త్యాగరాజును వేటూరి ఔపోసన పట్టారని తెలుస్తోంది. వేటూరిలో అన్నమయ్య‌ పూనడం కూడా జరిగింది. అందువల్లే "జానపదానికి జ్ఞాన పథం" ‌అనీ, "ఏడు స్వరాలలే ఏడు కొండలై" అనీ ఆయన రాయగలిగారు.

"కైలాసాన కార్తీకాన శివ‌రూపం / ప్రమిదేలేని ప్రమాదా లోక‌ హిమ దీపం" అని వేటూరి‌ అన్నది మనం మరో కవి ద్వారా వినంది. సాగర సంగమం  సినిమాలో "ఓం నమశ్శివాయ" పాటలోని సాహిత్యం న భూతో న‌ భవిష్యతి. భావుకత,‌ కల్పనా శక్తి , పద కూర్పుల పరంగా అది ఒక మహోన్నతమైన రచన. ఈ పాటలో "నీ మౌనమే దశోపనిషత్తులై ఇల‌ వెలయ" అన్న వాక్యం వేయి‌ కావ్యాల పెట్టు. ప్రస్థానత్రయంలోని ఉపనిషత్తులు‌‌ పదే. ఆ సత్యాన్నీ, మౌనమే వేదాంతం‌ అన్నదాన్నీ అద్భుతంగా మనకు అందించారు వేటూరి.‌ "గజముఖ షణ్ముఖ ప్రమధాదులు‌‌ నీ సంకల్పానికి ఋత్విజ వరులై‌" అనడం  రచనా సంవిధానంలో వేటూరి మహోన్నతుడని నిరూపిస్తోంది. ఇక్కడ ఈశ్వరుడి సంకల్ప‌ం అంటే ఈ‌ సృష్టి - దీనికి గజముఖ,‌షణ్ముఖ, ప్రమధ గణాలు ఋత్విజ వరులు (అంటే యజ్ఞం చేసే ఋత్విక్కులలో శ్రేష్ఠమైన వాళ్లు) అయ్యారు" అని అన్నారు. ఇక్కడ ఋత్విజ వరులు‌ అన్న పదం‌ వాడడం‌ వల్ల ఈశ్వర సంకల్పం‌ ఒక యజ్ఞం‌ అని యజ్ఞం అన్న పదం వాడకుండా‌ చెప్పారు వేటూరి‌‌. ఇది మహాకవుల లక్షణం. వేటూరి ఒక మహాకవి.

"శంకరా నాద శరీరా‌ పరా" పాటలో ఆయన‌ వాడిన‌ సంస్కృతం‌‌ తెలుగు సినిమా పాటకు జిలుగు. వేటూరికి‌ ముందు‌ మల్లాది రామకృష్ణ‌‌ శాస్త్రి సంస్కృతాన్ని‌ తెలుగు సినిమా పాటలో చక్కగా వాడారు. వేటూరి‌ సంస్కృతాన్ని‌ చిక్కగానూ‌ వాడారు. సప్తపది‌‌ చిత్రంలో "అఖిలాండేశ్వరి..." పాట పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ స్తోత్రంగా పూర్తి సంస్కృతంలో అద్భుతంగా‌ రాశారు వేటూరి.  తన పాటల్లో వేటూరి‌ ఎన్నో మంచి సమాసాల్ని, అలంకారాల్ని, కవి సమయాల్ని అలవోకగా ప్రయోగించారు. 

"చినుకులా రాలి నదులుగా సాగి" పాట ప్రేమ గీతాలలో ఒక ఆణిముత్యం. "ఏ వసంతమిది ఎవరి సొంతమిది?" అని వేటూరి కవిత మాత్రమే అడగగలదు. "ఈ దుర్యోధన, దుశ్శాసన..." పాటకు సాటి‌ రాగల పాట మన దేశంలో‌ మరొకటి ఉంటుందా? "ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది / మాధవుడు, యాదవుడు మా కులమే లెమ్మంది" ఇలా‌ రాయడానికి ఎంతో గరిమ ఉండాలి. ఆది‌ శంకరాచార్య, కాళిదాసు, కణ్ణదాసన్‌లలో మెరిసే పద పురోగతి  (Word-proggression) వేటూరిలో ఉంటుంది. తమిళ్ష్‌లో కణ్ణదాసన్ రాశాక అంతకన్నా గొప్పగా తెలుగులో ఒక్క‌ వేటూరి మాత్రమే రాశారు. వేటూరికి ముందు కణ్ణదాసన్ పాటలు రాసిన సందర్భాలకు తెలుగులో రాసిన‌ కవులున్నారు. వాళ్లు కణ్ణదాసన్ స్థాయిని‌ అందుకో లేకపోయారు. వేటూరి‌ మాత్రమే కణ్ణదాసన్ రాసిన‌ సందర్భానికి తెలుగులో‌ ఆయన కన్నా గొప్పగా రాయగలిగారు. అమావాస్య చంద్రుడు సినిమాలో కణ్ణదాసన్ "అందమే అందమూ  దేవత/ వేయి కవులు రాసే కావ్యము" అని రాస్తే ఆ సందర్భానికి వేటూరి "కళకే కళ‌ ఈ అందము,‌ ఏ‌ కవీ రాయని కావ్యము" అని‌ రాశారు. ఇలా ఆ‌ పాటలో  ప్రతిచోటా‌ వేటూరి‌ రచనే మిన్నగా ఉంటుంది. ఆ‌ సినిమాలో మరో పాట "సుందరమో సుమధురమో" పాట సందర్భానికి ముందుగా తమిళ్ష్‌లో వైరముత్తు‌ రాశారు. ఆ సందర్భానికీ వేటూరి‌ రచనే తమిళ్ష్‌ రచన‌కన్నా గొప్పది.‌ 

కన్నడ కవి ఆర్.ఎన్.‌జయగోపాల్ సొసె తన్ద సౌభాగ్య సినిమాలో "రవివర్మ కుంచె‌ కళకు భలే సాకారానివో/ కవి కల్పనలో కనిపిస్తున్న సౌందర్య జాలానివో" అని రాస్తే ఆ బాణికి రావణుడే రాముడైతే సినిమాలో "రవివర్మకే అందని ఒకే ఒక అందానివో/ ఆ రవి చూడని పాడని నవ్య నాదానివో" అని వేటూరి రాశారు. ఈ పాట చరణాలలో వేటూరిదే పైచేయి అయింది.  ఆ విషయాన్ని ఈ వ్యాస రచయిత  జయగోపాల్‌తో ప్రస్తావిస్తే ఆయన‌ కాదనలేక‌పోయారు. కన్నడ రాష్ట్రకవి జి.ఎస్. శివరుద్రప్ప రాసిన ఒక కవిత తరువాతి రోజుల్లో మానస సరోవర అన్న సినిమాలో పాటైంది. ఆ సినిమా తెలుగులో అమాయక చక్రవర్తి పేరుతో వచ్చింది. ఆ సందర్భానికి శివరుద్రప్ప రచనకన్నా తెలుగులో రాసిన వేటూరి రచనే మేలుగా ఉంటుంది. "వేదాంతి చెప్పాడు బంగారం అంతా మట్టి, మట్టి/ కవి ఒకడు పాడాడు మట్టి అంతా బంగారం, బంగారం" అని కన్నడ రచన అంటే
"వేదాంతమంటున్నది జగమంతా స్వప్నం, స్వప్నం/ కవి స్వాంతమంటున్నది జగమంతా స్వర్గం, స్వర్గం" అని వేటూరి అన్నారు. ఈ సందర్భంలోనూ పూర్తిగా వేటూరే మేలుగా నిలిచారు.

వేటూరి సినిమా పాటల్లో సాధించిన గజలియత్  గజళ్లు అని రాసి కూడా నారాయాణ రెడ్డి తీసుకురాలేకపోయారు. వీరభద్రుడు సినిమాలో "ఏదో మోహం, ఎదలో దాహం..." పాట పల్లవిలో "నిదురించే నా మనసే ఉలికిపడే ఊహలతో" అని అన్నాక రెండో చరణంలో "చందమామ ఎండకాసే నిప్పు పూలదండలేసే/ గుబులు గుబులు గుండెలోన అర్థరాత్రి తెల్లవారే" అనీ, "ఉండి ఉండి ఊపిరంతా పరిమళాల వెల్లువాయే/ ఆపలేని విరహవేదనే తీపి తీపిగా ఎదను కోయగా" అని వేటూరి అన్నది తెలుగులో గజల్ అని రాసిన, రాస్తున్న చాల మందికి పట్టిబడని గజలియత్.

అంతర్జాతీయ స్థాయి కవి గుంటూరు శేషేంద్రశర్మ  విశ్వఘోష కవితలో "వేసవి కాలపు వాగై, శుక్ల పాడ్యమీ వేళ శశిరేఖకు విడుచు నూలు పోగై అడగారిందేమో" అని ఒక శ్రేష్ఠమైన రచనా సంవిధానాన్ని ప్రదర్శించారు. వేటూరి ఆ స్థాయిలో, ఆ సంవిధానంలో "వానకారు కోయిలనై/ తెల్లవారి వెన్నెలనై/ ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని/ కడిమివోలె నిలిచానని..." అనీ, "రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై/ ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని‌..." అన్నారు. ఇది ఒక సృజనాత్మక రచనా వైశేష్యం.

"ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక / ఏదారెటు పోతుందో ఎవరెనీ అడగక" అనీ, "త్యాగరాజు కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టుందమ్మా" అనీ, "ఆబాలగోపాల మా బాల గోపాలుని/ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ" అనీ, "ఏ పూలు తేవాలి నీ పూజకు/ ఏ లీల చేయాలి నీ సేవలు" అనీ, "దీపాలెన్ని  ఉన్నా హారతొక్కటే/ దేవతలెందరున్నా అమ్మ ఒక్కటే" అనీ, "ఇది సంగ్రామం మహా సంగ్రామం/ శ్రమ జీవులు పూరించే శంఖారావం/అగ్ని హోత్రమే గోత్రం ఆత్మశక్తి మా హస్తం/ తిరుగులేని తిరుగుబాటు మా లక్ష్యం" అనీ,  "ఆకాశాన సూర్యుడుండడు సందె వేళకి/ చందమామకు రూపముండదు తెల్లవారితే" అనీ,  "కరిగే బంధాలన్నీ మబ్బులే" అనీ, "వేణువై వచ్చాను భువనానికి / గాలినై పోతాను గగనానికి" అనీ, "ఏడు కొండలకైనా బండ తానొక్కటే" అనీ అంటూ వేటూరి సుందరరామ్మూర్తి ఎన్నో కావ్య వాక్యాలను వాక్య కావ్యాలను విరచించారు. "సలిల సావిత్రీ", గమన గాయత్రీ",  "అమ్మా ఓం నమామి, నిన్నే నే స్మరామి", "దైవాలకన్నా దయ ఉన్న హృదయం, అమ్మ మా ఇంటి దీపం" వంటి వాక్యాలతో టి.వి. సీరియళ్ల సాహిత్యాన్నీ వెలయించారు వేటూరి. 

శిష్టమైన, విశిష్టమైన కవిత్వ ఆవిష్కరణ వేటూరి సుందరరామ్మూర్తి అభివ్యక్తి.


- రోచిష్మాన్
9444012279

Advertisement
 
Advertisement