Cyber Crime Prevention Tips: ఫోన్‌లో సిమ్‌కార్డ్‌ మార్చుకునే క్రమంలో వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇచ్చిన వర్ధని.. అంతే 80 వేలు మాయం!

Senior Citizen Lost Rs 80000 To Fraudsters Cyber Crime Prevention Tips - Sakshi

బామ్మా.. ఖాతాలో డబ్బులు ఎన్ని ఉన్నాయి..?

Cyber Crime Prevention Tips: వయసు పైబడిన వారిలో చాలావరకు స్మార్ట్‌ ఫోన్ల వాడకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్‌నెట్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌తో పాటు, తమకు కావల్సిన సమాచారం కోసం శోధించడమూ పెరిగింది. అనుకోకుండా తెలియని సైట్స్‌ని లింక్‌ చేయడం, ఇతర వెబ్‌సైట్లలో లాగిన్‌ అవడం వంటివి జరుగుతోంది. దీంతో వారి ఫోన్లకు ఫేక్‌ మెసేజ్‌లు, అవసరం లేని సమాచారం చేరుతుంది. దీంతోపాటు సీనియర్‌ సిటిజన్లు తమ వివరాలను తమకు తెలియకుండానే మోసగాళ్ల చేతికి అందించే అవకాశమూ పెరుగుతోంది. 

ఇటీవల ఓ సీనియర్‌ సిటిజన్‌ ఖాతా నుంచి రూ.80 వేల రూపాయలు సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారు. ఫోన్‌లో సిమ్‌కార్డ్‌ మార్చుకునే క్రమంలో వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇచ్చింది వర్ధని (పేరు మార్చడమైనది). సందేహం ఉంటే, మరో మెసేజ్‌లో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేయమని వచ్చిన మెసేజ్‌ చూసింది. ఆ మెసేజ్‌లో ఇచ్చిన నెంబర్‌కు ఫోన్‌ చేయడంతో ప్రాసెసింగ్‌ ఛార్జీల కోసం రూ.10 బదిలీ చేయడంతో పాటు, అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేయమని అడిగాడు కాలర్‌.

అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసి, తన డెబిట్‌ కార్డ్‌ నుంచి డబ్బు బదిలీ చేసింది. తర్వాత తన ఫోన్‌లో కాంటాక్ట్‌ నంబర్లేవీ కనిపించలేదు. అనుమానం వచ్చి, బ్యాంక్‌ను సంప్రదిస్తే రూ.80 వేలు మరో ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ అయిందని చెప్పడంతో షాక్‌ అయ్యింది.

టార్గెట్‌ గ్యాంగ్స్‌
రిటైర్‌ కాబోతున్నవారిని టార్గెట్‌ చేసే గ్యాంగ్స్‌ కొన్ని ఉంటాయి. వీళ్లు దాదాపు చదువుకుంటున్నవారే అయి ఉంటారు. పిల్లలు విదేశాల్లో ఉండి, వృద్ధ తల్లిదండ్రులు స్వదేశంలో ఒంటరిగా ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. వీరిని టార్గెట్‌ చేసుకొని మోసం చేసే గ్యాంగ్స్‌ కొత్తగా పుట్టుకు వస్తుంటాయి. ఒంటరి వృద్ధులకు కావల్సిన సరుకులు తెచ్చివ్వడం, చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, సమయం కేటాయించి కబుర్లు చెప్పడం, మేం ఉన్నామనే ధైర్యం ఇస్తూ కన్సర్న్‌ చూపడం చేస్తారు.

ఈ క్రమంలో పెద్దవాళ్లు నమ్మేస్తారు. మీ ఫోన్‌ మేం సెట్‌ చేస్తామని తీసుకోవడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి పెడతామని ముందుకు రావడం, ఓటీపీ, కెవైసీ వివరాలు దొంగిలించడం, క్రిప్టో కరెన్సీ పేరిట వంద రూపాయలు పెడితే 5 ఏళ్లలో పది లక్షల రూపాయలు వస్తాయని ఆశ చూపడం.. వంటి రకరకాల మార్గాల ద్వారా వివరాలు రాబడతారు. దీనిద్వారా డిజిటల్‌ మార్గాన మోసం చేయడానికి పూనుకుంటారు. చాలామంది వృద్ధులకు తమ ఖాతా నుంచి డబ్బులు పోయాయనే విషయం కూడా కొన్ని రోజుల వరకు తెలియదు. 

మరేం చేయాలి...?
డిజిటల్‌ ప్రపంచం గురించి అవగాహన పెంచుకోవడంతోపాటు మోసపూరిత అంశాల గురించి కూడా తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌ వేదికగా జరిగే మోసాలు ఏ తరహాలో ఉంటాయి, వాటి నుంచి తమను తాము రక్షించుకునే విధానాలను తెలుసుకోవాలి. లేదంటే, కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని పెద్దవాళ్లకు సైబర్‌ ఫ్రాడ్స్‌కు సంబంధించిన విషయాలపట్ల అవగాహన కల్పించాలి. 

ముందుగా.. 
ముందుగా షార్ట్‌ లింక్స్‌ వస్తాయి. రిటైర్డ్‌ వ్యక్తుల వివరాలు డార్క్‌నెట్‌లో లభిస్తుంటాయి. దీని ద్వారా షార్ట్‌ లింక్స్‌ వస్తుంటాయి. మీరు క్లిక్‌ చేయాలనుకున్న లింక్స్‌ యుఆర్‌ఎల్‌ సరైనదేనా అని ధ్రువీకరించడానికి  https://www.unshorten.it/ ద్వారా తెలుసుకోవచ్చు. 
www.isitphishing.org or www.urlvoid.comల ద్వారా అన్ని లింక్‌లను ధ్రువీకరించుకోవచ్చు. 
ఇ–మెయిల్‌ ద్వారా కొన్ని షార్ట్‌ లింక్స్‌ వస్తుంటాయి. వాటిని క్లిక్‌ చేయడం, తమ వివరాలను, బ్యాంకు వివరాలను పొందుపరచడం వంటివి చేయకూడదు.  
ఆఫర్‌ వచ్చిందనో, మనీ బ్యాక్‌ అనో.. మాటల్లో మభ్యపెట్టి ఓటీపీ, యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు తీసుకునేవారుంటారు. వీటికి ఏ మాత్రం స్పందించ కూడదు.
ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తులు ఎనీడెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయమనడం, మీ వ్యక్తిగత వివరాలను రాబట్టడం చేస్తుంటారు. ఫోన్‌ మాట్లాడే సమయంలో హెడ్‌ఫోన్‌ పెట్టుకొని స్క్రీన్‌ చూస్తున్నప్పుడు ఫ్రాడ్‌ జరిగితే విషయం తెలిసిపోతుంది.
ఉపయోగించే స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ వంటి పరికరాల్లో ఒరిజనల్‌ యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్‌ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తే మోసపూరిత షార్ట్‌లింక్స్‌కు అడ్డుకట్ట వేయచ్చు. 
ఆన్‌లైన్‌ షాపింగ్, యాప్‌ల ద్వారా డబ్బు బదిలీ చేసే సమయంలో కొన్ని సాంకేతిక అవాంతరాలు వస్తాయి. ఇలాంటప్పుడు గూగుల్‌ కస్టమర్‌కేర్‌ నెంబర్లకు అస్సలు ఫోన్‌ చేయకూడదు. 99 శాతం ఆ నంబర్లు మోసపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది. 
ఫోన్‌ మాట్లాడే సమయంలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయమనడం, ఓటీపీ, యుపిఐఎన్, బ్యాంక్‌ కార్డ్‌ సివివి నంబర్లు ఇవ్వమని అడగడం వంటివి చేస్తుంటే మీ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేస్తున్నారని గ్రహించాలి. 
సోషల్‌ మీడియా, బ్యాంకింగ్, ఇ–మెయిల్‌ ఖాతాల కోసం రెండు విడి విడి ఫోన్‌ నంబర్లను ఉపయోగించడం శ్రేయస్కరం. విశ్రాంత జీవనంలో ఉన్న పెద్దలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి కుటుంబ సభ్యులు తగిన సమయం కేటాయించుకోవాలి. ఈ డిజిటల్‌ యుగం గురించి పెద్దలకు అవగాహన కలిగించడాన్ని కుటుంబంలో ఉన్న నవతరం బాధ్యతగా తీసుకుంటే జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయచ్చు. 
-అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top