దేవీ భాగవతం, మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యం (సప్తశతి) ప్రకారం, దుర్గాదేవి ఆవిర్భావం వెనుక ఒక గొప్ప దివ్యగాథ ఉంది. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరాల బలంతో దేవతలను, మునులను ముప్పుతిప్పలు పెడుతూ ముల్లోకాలను గడగడలాడిస్తాడు. ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్న ఆ రాక్షసుడిని వరం కారణంగా ఎవరూ వధించలేక పోతారు.
అప్పుడు సమస్త దేవతల కోరిక మేరకు, వారి దేహాల నుండి వెలువడిన అనంతమైన దివ్యతేజస్సులు ఒక్కచోట చేరి ఒక మహోజ్వల దివ్యశక్తిగా రూపాంతరం చెందాయి. శివుని తేజస్సు ముఖంగాను, విష్ణువు తేజస్సు చేతులుగాను, బ్రహ్మ తేజస్సు పాదాలుగాను ఇలా సకల దేవతల అంశల నుండి ఆ మహాశక్తి ఉద్భవించింది. ఆ ఆదిశక్తే పద్నాలుగు లోకాలను రక్షించడానికి ఆయుధాలు ధరించి ‘మహిషాసురమర్దిని’ గా ఆవిర్భవించింది.
సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తుల సమాహారమే ఈ శక్తి స్వరూపం (త్రినాథ రూపిణి). అమ్మవారు కేవలం భయంకరమైన రాక్షసులను సంహరించడమే కాకుండా, భక్తుల హృదయాలలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
దసరా పర్వదినాలలో దుర్గాదేవిని తొమ్మిది ప్రత్యేక రూపాలలో పూజిస్తారు. ప్రతి రూపం మానవ ఆధ్యాత్మిక పరిణామ క్రమానికి ప్రతీక. ’దుర్గ’ అనే పదానికి వేదాంత పరంగా... పౌరాణిక పరంగా ఎంతో లోతైన అర్థాలున్నవి. జీవితంలో సాధకులు ఎదుర్కొనే దుర్గమమైన (కష్టతరమైన) అడ్డంకులను, భవసాగరాన్ని దాటించేది దుర్గ (దుర్గమనాశిని), రాక్షస ప్రవృత్తిని అణచివేసే శక్తి స్వరూపిణి అసుర సంహారిణి).
అమ్మవారిని ఆరాధించడం వల్ల కేవలం లౌకిక సుఖాలు మాత్రమే కాకుండా అత్యున్నత ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎలాంటి భయాలనైనా, మానసిక ఆందోళనలనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. తాంత్రిక యోగ మార్గాలలో దుర్గాదేవిని మూలాధార చక్రంలో నివసించే కుండలినీ శక్తికి సంకేతంగా భావిస్తారు. సాధన ద్వారా ఈ శక్తిని జాగృతం చేసుకుని సహస్రారం చేర్చడమే ఆధ్యాత్మిక గమ్యం. భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ చేయడం, దుర్గా సప్తశతి పఠించడం వల్ల గత జన్మల పాపాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
సమస్త విశ్వాన్ని తన గర్భంలో ఇముడ్చుకున్న విశ్వమాత దుర్గాదేవి అనుగ్రహం ఉంటే మనిషి జీవితంలో అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. ఆమె కరుణ ఒక తల్లిలా ప్రేమిస్తే, ఆమె శక్తి దుష్టులను శిక్షించే వజ్రాయుధమ వుతుంది. ఈ ఆధునిక దైనందిన జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, కష్టాలను ఎదుర్కొనేందుకు దుర్గాదేవి తత్వం మనకు ఎల్లప్పుడూ దీపస్తంభంలా మార్గదర్శనం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ జగన్మాతను మనసారా స్మరిస్తూ, అంతర్గత శక్తులను జాగృతం చేసుకుని శాంతియుతమైన, సార్థకమైన జీవితాన్ని గడపడమే నిజమైన దుర్గా పూజ.
అలంకారాల విశిష్టత, పరమార్థం
శరన్నవరాత్రులలో అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక అలంకారంలో (రూపంలో) భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు ధరించే అలంకారాల విశిష్టత, వాటి వెనక ఉన్న పరమార్థం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నవరాత్రుల పూజ సంపూర్ణ ఫలితాన్నిచ్చి, మోక్ష ప్రాప్తిని సర్వసౌఖ్యాలను ప్రసాదిస్తుంది.
మొదటి రోజు
శ్రీ బాల త్రిపురసుందరీ దేవి (శైలపుత్రి):
నవరాత్రుల మొదటి రోజు అమ్మవారిని బాలికా రూపంలో పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారు జ్ఞానం, ప్రశాంతతలకు ప్రతీక. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల విద్యలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.
రెండవ రోజు
శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మ చారిణి– తపస్సు):
సకల వేదాలకు మూలమైన గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఐదు ముఖాలు, పది చేతులతో అభయముద్రలో ఉండే ఈ రూపం బుద్ధిని, తేజస్సును ప్రసాదిస్తుంది. విద్యార్థులు, జ్ఞానాభిలాషులు ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తే మంచి బుద్ధి, జ్ఞాపకశక్తి కలుగుతాయి.
మూడవ రోజు
శ్రీ అన్నపూర్ణా దేవి విశేషాలు (చంద్రఘంట – ప్రశాంతత):
చేతిలో బంగారు గరిటె, భిక్షాపాత్ర ధరించి లోకానికి అన్నం పెట్టే తల్లిగా ఈ రూపం ఉంటుంది. ’అన్నపూర్ణ విశ్వభోక్త్రీ’ అంటారు. అన్నపూర్ణా దేవిని పూజిస్తే ఇంట ధాన్యానికి, ఆహారానికి ఎప్పటికీ లోటు ఉండద పూజిస్తే, అన్నదాన ఫలం లభిస్తుందని నమ్ముతారు.
నాలుగవ రోజు
శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి (కూష్మాండ –సృష్టి శక్త్యుద్భవ విశిష్టత): కామేశ్వర అంకపీఠంపై కూర్చుని, పాశాంకుశాలు ధరించి ఉండే రాజరాజేశ్వరీ స్వరూపం ఇది. ఈ రోజు పూజలు చేస్తే సృష్టి, స్థితి, లయకారక శక్తి ఈ అమ్మవారే. సకల సౌభాగ్యాలు, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి.
ఐదవ రోజు
శ్రీ మహాచండి / సరస్వతి దేవి అలంకారం (స్కందమాత – మాతృప్రేమ): పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి, చదువులో రాణించడానికి ఈ రోజు అత్యంత పవిత్రమైనది.ముఖ్యంగా నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రం రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి (జ్ఞాన ప్రదాయిని) అలంకారంలో వీణాపాణియై దర్శనమిస్తారు.
ఆరవ రోజు
శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం విశేషాలు
(కాత్యాయని: సాహసం – దుష్టశిక్షణ): పద్మాసనంలో కూర్చుని, భక్తులకు సిరులను కురిపించే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి స్వరూపం. ఈ రోజు పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, భక్తులకు సిరులను వ్యాపారాలలో అభివృద్ధి సిరిసంపదలు కలుగుతాయి.
ఏడవ రోజు
శ్రీ దుర్గా దేవి అలంకారం(కాళరాత్రి – అజ్ఞాన నాశనం):
దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం త్రిశూలం, ఆయుధాలు ధరించిన ఉగ్రరూపిణి, శక్తిస్వరూపిణి దుర్గాదేవి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, విఘ్నాలు, శత్రువుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తుంది. ఆమెను ’విఘ్ననాశిని’ ’దుష్ట శిక్షణ ప్రదాయిని’గా కొలుస్తారు.
ఎనిమిదవ రోజు
శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం
(మహాగౌరి: శాంతి – శుద్ధి): దుర్గాష్టమి రోజు వచ్చే ఈ రూపం అత్యంత శక్తిమంతమైనది. మహిషాసురుడిని వధించిన విజయగర్వంతో, ప్రచండ తేజస్సుతో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు పూజ చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి, అనుకున్న కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
తొమ్మిదవ రోజు
శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం సిద్ధిదాత్రి (పరిపూర్ణత):
సాధకుడికి సమస్త సిద్ధులను, జ్ఞానాన్ని అందించి మోక్షమార్గాన్ని సుగమం చేస్తుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ
తెలుగు రాష్ట్రాలలో దసరా శరన్నవరాత్రులు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది విజయవాడ కృష్ణా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం. ఈ క్షేత్రంలో శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా జరుగుతాయి. ఇంద్రుడు ఈ పర్వతంపై తపస్సు చేయడం వల్ల ‘ఇంద్రకీలాద్రి’ అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వయంభువుగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు కలిగి, కనకవర్ణంతో ప్రకాశిస్తుంది కాబట్టి ’కనకదుర్గ’ అయింది. నవరాత్రుల చివరి రోజున విజయదశమి పర్వదినాన కృష్ణా నదిలో జరిగే తెప్పోత్సవం (హంస వాహనంపై అమ్మవారి ఉత్సవ మూర్తిని నదిలో విహరింపజేయడం) ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
ఫోటో కర్టసీ: ఎస్ కె. సుభాని, ఇంద్రకీలాద్రి,
సాక్షి విజయవాడ
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి


