breaking news
Mahashakti
-
దేవీ నవరాత్రులు జ్ఞాన మార్గానికి నవ శక్తి
దేవీ భాగవతం, మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యం (సప్తశతి) ప్రకారం, దుర్గాదేవి ఆవిర్భావం వెనుక ఒక గొప్ప దివ్యగాథ ఉంది. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరాల బలంతో దేవతలను, మునులను ముప్పుతిప్పలు పెడుతూ ముల్లోకాలను గడగడలాడిస్తాడు. ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్న ఆ రాక్షసుడిని వరం కారణంగా ఎవరూ వధించలేక పోతారు. అప్పుడు సమస్త దేవతల కోరిక మేరకు, వారి దేహాల నుండి వెలువడిన అనంతమైన దివ్యతేజస్సులు ఒక్కచోట చేరి ఒక మహోజ్వల దివ్యశక్తిగా రూపాంతరం చెందాయి. శివుని తేజస్సు ముఖంగాను, విష్ణువు తేజస్సు చేతులుగాను, బ్రహ్మ తేజస్సు పాదాలుగాను ఇలా సకల దేవతల అంశల నుండి ఆ మహాశక్తి ఉద్భవించింది. ఆ ఆదిశక్తే పద్నాలుగు లోకాలను రక్షించడానికి ఆయుధాలు ధరించి ‘మహిషాసురమర్దిని’ గా ఆవిర్భవించింది.సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తుల సమాహారమే ఈ శక్తి స్వరూపం (త్రినాథ రూపిణి). అమ్మవారు కేవలం భయంకరమైన రాక్షసులను సంహరించడమే కాకుండా, భక్తుల హృదయాలలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.దసరా పర్వదినాలలో దుర్గాదేవిని తొమ్మిది ప్రత్యేక రూపాలలో పూజిస్తారు. ప్రతి రూపం మానవ ఆధ్యాత్మిక పరిణామ క్రమానికి ప్రతీక. ’దుర్గ’ అనే పదానికి వేదాంత పరంగా... పౌరాణిక పరంగా ఎంతో లోతైన అర్థాలున్నవి. జీవితంలో సాధకులు ఎదుర్కొనే దుర్గమమైన (కష్టతరమైన) అడ్డంకులను, భవసాగరాన్ని దాటించేది దుర్గ (దుర్గమనాశిని), రాక్షస ప్రవృత్తిని అణచివేసే శక్తి స్వరూపిణి అసుర సంహారిణి).అమ్మవారిని ఆరాధించడం వల్ల కేవలం లౌకిక సుఖాలు మాత్రమే కాకుండా అత్యున్నత ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎలాంటి భయాలనైనా, మానసిక ఆందోళనలనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. తాంత్రిక యోగ మార్గాలలో దుర్గాదేవిని మూలాధార చక్రంలో నివసించే కుండలినీ శక్తికి సంకేతంగా భావిస్తారు. సాధన ద్వారా ఈ శక్తిని జాగృతం చేసుకుని సహస్రారం చేర్చడమే ఆధ్యాత్మిక గమ్యం. భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ చేయడం, దుర్గా సప్తశతి పఠించడం వల్ల గత జన్మల పాపాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.సమస్త విశ్వాన్ని తన గర్భంలో ఇముడ్చుకున్న విశ్వమాత దుర్గాదేవి అనుగ్రహం ఉంటే మనిషి జీవితంలో అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. ఆమె కరుణ ఒక తల్లిలా ప్రేమిస్తే, ఆమె శక్తి దుష్టులను శిక్షించే వజ్రాయుధమ వుతుంది. ఈ ఆధునిక దైనందిన జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, కష్టాలను ఎదుర్కొనేందుకు దుర్గాదేవి తత్వం మనకు ఎల్లప్పుడూ దీపస్తంభంలా మార్గదర్శనం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ జగన్మాతను మనసారా స్మరిస్తూ, అంతర్గత శక్తులను జాగృతం చేసుకుని శాంతియుతమైన, సార్థకమైన జీవితాన్ని గడపడమే నిజమైన దుర్గా పూజ.అలంకారాల విశిష్టత, పరమార్థంశరన్నవరాత్రులలో అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక అలంకారంలో (రూపంలో) భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు ధరించే అలంకారాల విశిష్టత, వాటి వెనక ఉన్న పరమార్థం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నవరాత్రుల పూజ సంపూర్ణ ఫలితాన్నిచ్చి, మోక్ష ప్రాప్తిని సర్వసౌఖ్యాలను ప్రసాదిస్తుంది.మొదటి రోజు శ్రీ బాల త్రిపురసుందరీ దేవి (శైలపుత్రి): నవరాత్రుల మొదటి రోజు అమ్మవారిని బాలికా రూపంలో పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారు జ్ఞానం, ప్రశాంతతలకు ప్రతీక. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల విద్యలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మ చారిణి– తపస్సు): సకల వేదాలకు మూలమైన గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఐదు ముఖాలు, పది చేతులతో అభయముద్రలో ఉండే ఈ రూపం బుద్ధిని, తేజస్సును ప్రసాదిస్తుంది. విద్యార్థులు, జ్ఞానాభిలాషులు ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తే మంచి బుద్ధి, జ్ఞాపకశక్తి కలుగుతాయి.మూడవ రోజు శ్రీ అన్నపూర్ణా దేవి విశేషాలు (చంద్రఘంట – ప్రశాంతత): చేతిలో బంగారు గరిటె, భిక్షాపాత్ర ధరించి లోకానికి అన్నం పెట్టే తల్లిగా ఈ రూపం ఉంటుంది. ’అన్నపూర్ణ విశ్వభోక్త్రీ’ అంటారు. అన్నపూర్ణా దేవిని పూజిస్తే ఇంట ధాన్యానికి, ఆహారానికి ఎప్పటికీ లోటు ఉండద పూజిస్తే, అన్నదాన ఫలం లభిస్తుందని నమ్ముతారు.నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి (కూష్మాండ –సృష్టి శక్త్యుద్భవ విశిష్టత): కామేశ్వర అంకపీఠంపై కూర్చుని, పాశాంకుశాలు ధరించి ఉండే రాజరాజేశ్వరీ స్వరూపం ఇది. ఈ రోజు పూజలు చేస్తే సృష్టి, స్థితి, లయకారక శక్తి ఈ అమ్మవారే. సకల సౌభాగ్యాలు, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి.ఐదవ రోజు శ్రీ మహాచండి / సరస్వతి దేవి అలంకారం (స్కందమాత – మాతృప్రేమ): పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి, చదువులో రాణించడానికి ఈ రోజు అత్యంత పవిత్రమైనది.ముఖ్యంగా నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రం రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి (జ్ఞాన ప్రదాయిని) అలంకారంలో వీణాపాణియై దర్శనమిస్తారు.ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం విశేషాలు (కాత్యాయని: సాహసం – దుష్టశిక్షణ): పద్మాసనంలో కూర్చుని, భక్తులకు సిరులను కురిపించే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి స్వరూపం. ఈ రోజు పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, భక్తులకు సిరులను వ్యాపారాలలో అభివృద్ధి సిరిసంపదలు కలుగుతాయి.ఏడవ రోజు శ్రీ దుర్గా దేవి అలంకారం(కాళరాత్రి – అజ్ఞాన నాశనం): దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం త్రిశూలం, ఆయుధాలు ధరించిన ఉగ్రరూపిణి, శక్తిస్వరూపిణి దుర్గాదేవి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, విఘ్నాలు, శత్రువుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తుంది. ఆమెను ’విఘ్ననాశిని’ ’దుష్ట శిక్షణ ప్రదాయిని’గా కొలుస్తారు.ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం (మహాగౌరి: శాంతి – శుద్ధి): దుర్గాష్టమి రోజు వచ్చే ఈ రూపం అత్యంత శక్తిమంతమైనది. మహిషాసురుడిని వధించిన విజయగర్వంతో, ప్రచండ తేజస్సుతో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు పూజ చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి, అనుకున్న కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం సిద్ధిదాత్రి (పరిపూర్ణత): సాధకుడికి సమస్త సిద్ధులను, జ్ఞానాన్ని అందించి మోక్షమార్గాన్ని సుగమం చేస్తుంది.ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మతెలుగు రాష్ట్రాలలో దసరా శరన్నవరాత్రులు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది విజయవాడ కృష్ణా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం. ఈ క్షేత్రంలో శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా జరుగుతాయి. ఇంద్రుడు ఈ పర్వతంపై తపస్సు చేయడం వల్ల ‘ఇంద్రకీలాద్రి’ అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వయంభువుగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు కలిగి, కనకవర్ణంతో ప్రకాశిస్తుంది కాబట్టి ’కనకదుర్గ’ అయింది. నవరాత్రుల చివరి రోజున విజయదశమి పర్వదినాన కృష్ణా నదిలో జరిగే తెప్పోత్సవం (హంస వాహనంపై అమ్మవారి ఉత్సవ మూర్తిని నదిలో విహరింపజేయడం) ఇక్కడి ప్రధాన ఆకర్షణ.ఫోటో కర్టసీ: ఎస్ కె. సుభాని, ఇంద్రకీలాద్రి, సాక్షి విజయవాడ– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
దీపావళికి మహాశక్తి
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ .సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నామని యూనిట్ పేర్కొంది. నయనతార లీడ్ రోల్లో ఆర్జె బాలాజీ, ఎన్జె శరవణన్ దర్శకత్వం వహించిన ‘మూకుత్తి అమ్మన్’ 2020 నవంబరు 14న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందుతోంది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్‌పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార నటన, కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ పేర్కొన్నారు. గతంలో ‘మూకుత్తి అమ్మన్’ చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘మహాశక్తి’ని కూడా నవంబర్‌లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పండగ సమయంలో దైవిక కథాంశంతో కూడిన చిత్రాలకు కుటుంబ ప్రేక్షకాదరణ బాగుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. -
స్త్రీ శక్తి విజయం విజయ దశమి
ఈ చరాచర జగత్తుని నడిపించేది శక్తి. ఈ శక్తి లేనట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కృత్యాలైన సృష్టి స్థితిలయాలు నిర్వర్తించటమే కాదు, కదలటం కూడా చేత కాని వారవుతారు. ఆ శక్తినే అదిశక్తి, పరాశక్తి అంటారు. ఆ శక్తి త్రిగుణాత్మకంగా ఉంటుంది. సత్వరజస్తమో గుణాలతో శక్తిబీజం సంయోగం చెందితే ‘స్త్రీ’అవుతుంది. అటువంటి త్రిగుణాలతో కూడిన శక్తి ఆవిర్భవించి దుష్టరాక్షస సంహారం చేసిన సమయం శరదృతువు. ఇవే కాదు మహాశక్తి ఎప్పుడు ఎక్కడ దుష్టసంహారం చేయవలసిన అవసరం వచ్చినా, శిష్టరక్షణ చేయవలసిన అవసరం కలిగినా జీవులపై ఉన్న అంతులేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది. ఎంతైనా జగన్మాత కదా! అన్ని సందర్భాలలోను ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమి నాడు రాక్షససంహారం చేయటం జరిగింది. కనుక ఆదిపరాశక్తిని ఆ సమయంలో పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందటం సంప్రదాయం అయింది. అందరు దేవతల శక్తి ఏకీకృతమై రూపుదాల్చిన శ్రీదేవి రాక్షసులతో యుద్ధంచేసే సమయంలో దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలగటానికి – యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణలు మొదలైన దీక్షలు పూనారు. మానవులు కూడా ఉడతాభక్తిగా తమకు తోచిన విధంగా దీక్షలు చేయటం మొదలు పెట్టారు. ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైనది. నిర్గుణయైన పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం తమోగుణమయమైన మహాకాళి. అందువల్లనే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని జగదంబిక త్రిశక్తులలో మొదటిదిగా మహాకాళినే పేర్కొనటం జరుగుతుంది. ఇది వైవస్వత మన్వంతర వృత్తాంతం. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి హేతువు మహిషాసురుడు.ఈ తత్త్వాన్ని వంట పట్టించుకోవటం ఏ కాలం లోనైనా అవసరమే. మహిషాసురులు ఎప్పుడూ ఉంటారు. అందుకే మహిషాసుర మర్దినులైన మహాలక్ష్ముల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మహిషుని సంహరించేందుకు త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా ఆకారం ధరించింది. దేవతలందరూ ఆమెకు తమ తేజస్సును, ఆయుధాలను సమకూర్చారు. తన సంహారం కోసమే ఆమె ఆవిర్భవించిందని తెలిసినా మహిషుడు రకరకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలని చూశాడు. ఆమె అంగీకరించకపోయేసరికి కామరూపి గనుక ఆమెతో రకరకాల రూపాలతో యుద్ధం చేశాడు. ఆ రూపాలకు తగిన రూపాలను ధరించి దేవి మహిషరూపంలో ఉన్న రాక్షసుని సంహరించింది. ఇది జరిగింది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున. అప్పటివరకు దీక్ష వహించిన వారందరు దశమి నాడు జగదంబను స్తుతించి, అమ్మకు పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయానికి వేడుకలు చేసుకుని ఆనందించారు. వారి స్తుతులకు సంతసించిన శ్రీ దేవి వారిని వరం కోరుకోమన్నది. తమకు అవసరమైనప్పుడు ఈ విధంగా కాపాడమని కోరారు. ఆమె వారు తలచినప్పుడు అవతరిస్తానని మాట ఇచ్చింది. మరొకప్పుడు శుంభ నిశుంభులనే దానవ సోదరులు వేల ఏండ్లు తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపసుకి మెచ్చి, ప్రత్యక్షమై వరం కోరుకోమంటే – తమకు అమరత్వం ప్రసాదించమని కోరారు. బ్రహ్మ అది తన చేతులలో లేదని, ఇంకేదైన వరం కోరుకోమని అన్నాడు. వారు తమకు అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం ఇమ్మని కోరారు. అంతటితో ఆగలేదు. స్త్రీలు బలహీనులు కనుక మాకు వారి వల్ల భయం లేదు అని చెప్పారు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. స్వర్గంపై దాడి చేసి, ఇంద్రుని ఆసనాన్ని అధిరోహించి, త్రైలోక్యాధిపత్యాన్ని, యాగభాగాలని కూడా హరించారు. దిక్పాలకులను సూర్యచంద్రాది దేవతలను గెలిచి, వారి పదవులను కూడా గ్రహించాడు. వారి పనులు కూడా తానే చేయటం మొదలు పెట్టాడు. దేవతలు బృహస్పతి సూచనననుసరించి హిమవత్పర్వతం మీద ఉన్న దేవిని శరణు వేడారు. జగదంబ వారికి అభయం ఇచ్చింది. ఆ సమయంలో సర్వదేవతలు తమ తమ శక్తులను జగదంబకు తోడుగా పంపారు. అవన్నీ ఆయా దేవతలకు చెందిన ఆభరణాలను, ఆయుధాలను ధరించి, వాహనాలను అధిరోహించి వచ్చి రక్తబీజుని సైన్యాన్ని మట్టు పెట్టసాగాయి. ఈ శక్తులను మాతృకాగణాలు అంటారు. 1. బ్రహ్మ శక్తి బ్రహ్మాణి. 2. విష్ణువు శక్తి వైష్ణవి 4. కుమారస్వామి శక్తి షష్ఠీ దేవి కౌమారి. 5. ఇంద్రుని శక్తి ఐంద్రి, మాహేంద్రి, ఇంద్రాణి అనే పేర్లు కూడా ఆమెకున్నాయి. 6. ఆదివరాహమూర్తి శక్తి వారాహీ దేవి 7. నృసింహుని శక్తి నరసింహ రూపం నారసింహీ అనే నామం. ఈ మాతృకా గణంతో పాటుగా వరుణుని శక్తి వారుణీదేవి శత్రువులని పాశంతో బంధించి, మూర్చితులను చేసి, ప్రాణాలను తీస్తోంది. యముని రూపంతో యముని శక్తి యామ్యాదేవి మహిషము నెక్కి, దండాన్ని ధరించి, భయం గొలిపే విధంగా రణభూమిలో అడుగు పెట్టి, దానవులని యమసదనానికి పంపుతోంది. వీరికి తోడు శివదూతి కూడ విజృంభించి దానవులను నేలకూల నేస్తూ ఉంటే, చాముండా, కాళికలు వారిని తినేస్తున్నారు. దానవులు భయపడి పారిపోతుంటే రక్తబీజుని కోపం మిన్ను ముట్టి, దేవితో యుద్ధానికి వచ్చాడు. మాతృకాగణాలు అతడిపై ఆయుధాలను వేయగానే వాడి శరీరం నుండి కారిన ప్రతి రక్తబిందువు నుండి, ఒక్కొక్క రక్తబీజుడు పుట్టి వారి సంఖ్య అసంఖ్యాకం అయింది. దేవతలందరు భయభ్రాంతులై పోయారు. అప్పుడు అంబిక కాళికను నోరు పెద్దది చేసి, రక్తబీజుడి నుండి కారుతున్న రక్తాన్నంతా తాగివేయ మని చెప్పింది. వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని, కింద పడకుండా తాగటంతో వాడు నీరసించాడు. వాడి శరీరాన్ని శ్రీదేవి ముక్కలు చేస్తుంటే, కాళిక తినేసింది. అంబిక వాహనమైన సింహం కూడా ఎంతో మంది దానవులని తినేసింది. అపుడు నిశుంభుడు శ్రీదేవితో యుద్ధానికి బయల్దేరాడు. ముందుగా నిశుంభుడి తల తెగ నరికింది దేవి. అయినా అతడి మొండెం కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఆ మొండెం కాళ్ళు చేతులు నరికింది దేవి. దానితో నిశుంభుడు అసువులు బాసాడు. శుంభుణ్ణి శ్రీదేవి తనతో యుద్ధం చేయలేకపోతే చండికతో గాని, కాళికతో గాని యుద్ధం చెయ్యమంది. అతడు పౌరుషం పెరిగి, శ్రీదేవితోనే యుద్ధం చేయదలచాడు. ఘోరయుద్ధం తరువాత శ్రీదేవి శుంభుని పరిమార్చింది. దేవతలకు తిరిగి స్వర్గ రాజ్యం లభించింది. మాటలతో సాధించిన విజయానికి సంకేతం ఇది. మాట నైపుణ్యంతో యుద్ధానికి ఆహ్వానించి గెలిచిన జగన్మాత అవతారాన్ని మహా సరస్వతిగా చెప్పటం జరిగింది. సామూహికంగా కుంకుమార్చనలు చేసినా, చండీహోమాదులు చేసినా, బొమ్మల కొలువులు పెట్టినా, బతకమ్మలు ఆడినా కనపడేది ఏదైనా పదిమంది కలిసి చేయాలనే ఐక్యభావన. శక్తి స్వరూపమైన స్త్రీ జాతి పట్ల గౌరవ మర్యాదలు నెరపటం. ‘‘యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’’ నవరాత్రులు అన్నా, అమ్మవారి పూజలన్నా ప్రధానంగా చేసేది లలితా రహస్య నామ సాహస్ర పారాయణం. కుంకుమార్చన చేసినా సహస్రనామాలతోనే చేస్తారు. జగదంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తం బ్రహ్మాండ పురాణం లలితో పాఖ్యానంలో వివరించబడింది. ఆమె సర్వచైతన్యస్వరూపిణి కనుక ఆమెను ‘లలిత’ అని పిలిచారు.తమను కన్నతల్లి లాగా భావించి శ్రీమాతా! అని సంబోధించారు. జీవితం అంటే సుఖపడటం – సుఖపడటం అంటే తినటం, నిద్ర పోవటం మాత్రమే అని భావించటమే బండతనం. అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా! బండతనం పోవాలంటే తగిన మార్గం ఒకటే. అది చైతన్యవంతులు కావటమే. అందుకే జగదంబ భండాసురవధ చేయటానికి సర్వచైతన్యస్వరూపిణిగా అవతరించింది. బండతనం మీద చైతన్యం విజయం సాధించటానికి సంకేతం విజయదశమి. శరన్నవరాత్రులలో అమ్మ అవతారాలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి శక్తి అన్నా చైతన్యమన్నా ఒకటిగానే భాసిస్తాయి. చైతన్యం లేనిదే శక్తి వ్యక్తం అయ్యే అవకాశం లేదు కదా! సమాజంలో ఎప్పుడూ మంచి చెడూ కలిసే ఉంటాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణలో మంచి గెలవటానికి ప్రతీక విజయ దశమి. అలా మంచి గెలవటానికి ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తిగా అవతరించి సజ్జనులకు తోడుపడుతుంది జగన్మాత. అది శరీరంలో అనారోగ్యం కావచ్చు, మనస్సులో ఉన్న దుర్గుణాలు, దురాలోచనలు కావచ్చు, సమాజంలో ఉన్న దురాచారాలు, మూఢనమ్మకాలు కావచ్చు, ప్రకృతిని, పర్యావరణాన్ని కలుషితం చేసే మాలిన్యాలు కావచ్చును, సృష్టి నియమాలకి విరుద్ధంగా కలకాలం బతికి ఉండాలనే స్వార్థం కావచ్చును, ఒక జాతినో, వర్గాన్నో చులకన చేసే అహంకారం కావచ్చు ఒక జాతినో, వర్గాన్నో అవమానం చెయ్యటం కావచ్చును – ఇటువంటి ఎన్నో చెడులక్షణాల మీద విజయం సాధించిన రోజు విజయ దశమి. ముఖ్యంగా స్త్రీ పట్ల చులకన భావం కలిగిన దున్నపోతు మనస్తత్వం మీద స్త్రీ శక్తి విజయానికి సంకేతం విజయ దశమి. సద్భావనలు పెంపొందించుకునే రోజు. అందుకే ఒకరినొకరు అభినందించుకుంటూ జమ్మి పత్రాలని బంగారం, వెండి అనే పేరుతో పంచుకుంటూ ఉంటారు. – డాక్టర్ ఎన్ .అనంతలక్ష్మి -
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి?
తెలుసుకుందాం భారత ఉపఖండంలో శక్తిపీఠాలు చాలానే ఉన్నా, అష్టాదశ శక్తిపీఠాలు ముఖ్యమైనవి. వీటినే మహాశక్తి పీఠాలని కూడా అంటారు. ఇవి వరుసగా... 1. శాంకరీదేవి తృణకోమలి, శ్రీలంక 2. కామాక్షీదేవి కంచి, తమిళనాడు 3. శృంఖలాదేవి పాండువా, పశ్చిమబెంగాల్ 4. చాముండేశ్వరీదేవి మైసూరు, కర్ణాటక 5. జోగులాంబాదేవి ఆలంపూర్, తెలంగాణ 6. భ్రమరాంబికాదేవి శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ 7. మహాలక్ష్మీదేవి కొల్హాపూర్, మహారాష్ట్ర 8. రేణుకాదేవి మహుర్, మహారాష్ట్ర 9. మహాకాళీదేవి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ 10. పురుహూతికాదేవి పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ 11. బిరజాదేవి జాజ్‌పూర్, ఒడిశా 12. మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ 13. కామరూపాదేవి గువాహటి, అసోం 14. మాధవేశ్వరీదేవి ప్రయాగ, ఉత్తరప్రదేశ్ 15. వైష్ణవీదేవి కాంగ్రా, జ్వాలాముఖి, హిమాచల్‌ప్రదేశ్ 16. సర్వమంగళాదేవి గయ, బీహార్ 17. విశాలాక్షీదేవి వారణాసి, ఉత్తరప్రదేశ్ 18. సరస్వతీదేవి కాశ్మీర్


