ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు! | - | Sakshi
Sakshi News home page

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!

Jul 6 2025 6:41 AM | Updated on Jul 6 2025 6:41 AM

ప్రేమ

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!

జిల్లాలో జంతువులు వివరాలు ఇలా...

పెంపుడు కుక్కలు 11,159

ఆవులు 70,846

గేదెలు 1,67,106

గొర్రెలు 1,67,052

మేకలు 72,076

పందులు 1,207

పౌల్ట్రీ 1,77,86,778

మూగజీవాల పెంపకంపై అవగాహన

అవసరం

వాటిపై ప్రేమ మాటున పొంచి ఉన్న

వ్యాధుల ముప్పు

అశ్రద్ధ చేయవద్దంటున్న వైద్యులు

నేడు ప్రపంచ జునోసిస్‌ డే

రాజమహేంద్రవరం రూరల్‌/బిక్కవోలు: సమాజంలో జంతు ప్రేమ రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో వాటి వల్ల వచ్చే వ్యాధులపై వాటిని పెంచుకునేవారికి లేదనేది వాస్తవం. వైద్య పరిశోధన ప్రకారం జంతువల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సుమారు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలా సోకే వ్యాధులను జునోసిస్‌ అంటారు. జూనిటిక్‌ వ్యాధులను వైరస్‌ బాక్టీరియల్‌, పారసైటిక్‌ వ్యాధులుగా విభజించారు. వైరస్‌ వలన సంక్రమించే వ్యాధులలో రేబిస్‌, మెదడువాపు వ్యాధి, బర్డ్‌ఫ్లూ వంటివి ముఖ్యమైనవి. బాక్టీరియా వలన సంక్రమించే వ్యాధుల్లో బ్రూసెల్లా, సాల్మోనెల్లా, లెప్టోసైరోసిస్‌ మొదలైనవి ఉన్నాయి. కుక్కకాటుతో రేబీస్‌, పందుల వల్ల మెదడువాపు, పశువులు, గొర్రెల నుంచి టీబీ వ్యాధులు సంక్రమిస్తాయని, వీటన్నింటిలో రేబిస్‌ ప్రమాదకరమైనదని వైద్యులు పేర్కొంటున్నారు.

జునోసిస్‌ ఎలా వచ్చిందంటే...

పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి లూయీపాశ్చర్‌ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6న మొట్టమొదటిసారిగా యాంటీ రేబిస్‌ టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ రోజుకు గుర్తుగా ఏటా ప్రపంచ జునోసిస్‌ డే నిర్వహిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ ఎంతో అవసరం

పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని, సమయం లేక అశ్రద్ధ చేస్తుంటారు. దీని వల్ల అవి కరిచిన, రక్కిన సందర్భాలలో ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. అందువల్ల వాటికి వ్యాక్సినేషన్‌ చేయించడం ఎంతో అవసరమని గుర్తించాలి.

జాగ్రత్తలివీ

● పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు సకాలంలో వేయించాలి.

● టీకాల షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాలి.

● పెంపుడు జంతువులను, వాటి ఆహారాన్ని లేదా వ్యర్థాలను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి. లిట్టర్‌ బాక్సులు, పంజరాలను తరచుగా శుభ్రం చేయాలి.

● బయట తిరిగే జంతువులకు క్రమం తప్పకుండా క్రిములను తొలగించాలి.

● పెంపుడు జంతువులు అడవి జంతువులతో కలవకుండా చూడటంతో పాటు, సరైన రక్షణ లేకుండా గాయపడిన అడవి జంతువులను రక్షించడానికి ప్రయత్నించకూడదు.

● జంతువుల అనారోగ్య లక్షణాలను గమనించాలి.

ప్రవర్తన, ఆకలి, లేదా ఏవైనా మార్పులను గమనించడం, ఏదైనా ఆసాధారణమైనది గమనిసై వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

పాడి రైతులకు ఇలా..

● బలమైన జీవభద్రతా చర్యలను అమలు చేయాలి.

● పశువుల దగ్గరకు అవసరమైన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి.

● జంతు సమూహాల మధ్య కదిలేటప్పడు పాద రక్షలు, రక్షిత దుస్తులను ఉపయోగించాలి.

● పశుశాలలు, పాలు పిండే ప్రదేశాలు, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

● క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.

● అనారోగ్యంతో ఉన్న జంతువులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.

కోళ్ల రైతులకు జాగ్రత్తలివీ

● ఒకే వయస్సు ఉన్న పక్షులను కలిపి పెంచాలి.

● గుంపుల మధ్య పూర్తిగా శుభ్రపరిచి, ఆ ప్రాంతంలో క్రిమి సంహార మందులు చల్లాలి.

● అడవి పక్షులతో సంపర్కాన్ని నివారించడానికి వలలు లేదా మూసిన గూళ్లను ఉపయోగించాలి.

● ఆహారం తీసుకోవడంలో లేదా గుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల వంటి ఆనారోగ్య లక్షణాలను గమనించడంతో పాటు, అసాధారణ మరణాలు లేదా లక్షణాలను వెంటనే పశువైద్య అధికారులకు తెలియజేయాలి.

అవగాహన పెంచుకోవాలి

● జూనోటిక్‌ వ్యాధుల సమాచారాన్ని ఎప్పటి కప్పడు తెలుసుకోవాలి.

● జంతు ఆరోగ్యం, జూనోసిస్‌పై వర్క్‌షాప్‌లు లేదా సెమినార్లకు హాజరుకావాలి.

● అనుమానిత జూనోటిక్‌ వ్యాధులను గుర్తిస్తే పశువైద్యులు, అధికారులకు తెలియజేయాలి.

వైద్యుల సలహాలు తప్పనిసరి

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను జునాటిక్‌ డిసీజెస్‌ అంటారు. ఎబోలా, బర్డ్‌ఫ్లూ, రేబిస్‌, మెదడువాపు వంటివి ఈ రకమైనవే. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వైద్యుల సలహాలు తప్పనిసరి. ఇంట్లో కుక్కలను పెంచేవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన వ్యాక్సిన్‌ వేయించకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. ఆదివారం రాజమ హేంద్రవరం ఏరియా పశువైద్యశాలలు, అనపర్తి, బి క్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల్లోని పశువైద్యశాలల్లో టీకాలు వేస్తున్నాం. జునోసిస్‌ వ్యాధులపై వైద్యాధికారులు అవగాహన కల్పిస్తారు. అలాగే పెంపుడు జంతువులకు, వాటితో దగ్గరగా మెలిగే యజ మానులకు, పశుసంవర్ధకశాఖ సిబ్బందికి, మున్సిపల్‌ వర్కర్లుకు, జంతువధశాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్‌ టీకాలు వేస్తాం.

–టి.శ్రీనివాసరావు, జిల్లా పశువైద్యాధికారి,

తూర్పుగోదావరి

ముందస్తు నివారణ మేలు

జునోసిస్‌ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనుషులకు, అటు జంతువులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాణాంతక జోనోసిస్‌ వ్యాధులపై సరైన అవగాహన ఉంటే చాలా వరకు వీటిని ఆరికట్టవచ్చు. జునోసిస్‌ వ్యాధుల సంక్రమణ, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

– డాక్టర్‌ శ్రీనివాస్‌, పశుసంవర్థక శాఖ ఏడీ, అనపర్తి

ప్రేమ ఒక మత్తు. అది మనుషుల మీదయినా.. మూగ జీవాల మీదయినా. వీటి ప్రేమ అన్‌కండీషనల్‌. చిన్న బిస్కెట్‌ ముక్క పెడితే చాలు.. ఏళ్ల తరబడి ప్రేమ కురిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమకి పడిపోని మనిషుండడు. అవి ఏ స్థితిలో ఉన్నా దానిని ముద్దుచేస్తూ.. దాని నోటిలో చేతులు పెడుతూ.. దగ్గరకు తీసుకుని గాఢాలింగనాలు చేసుకుంటూ ప్రేమ వ్యక్తపరుస్తుంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు. పాముకు పాలు పోసి పెంచినా దాని సహజ లక్షణం కాటు వేయడం. అలాగే కుక్కలు.. పిల్లులు.. కోతులు.. కుందేళ్ల వంటి మూగ జీవులను ఎంత ప్రేమగా పెంచినా స్వాభావికంగా చర్మం.. విసర్జకాలు.. వెంట్రుకలు.. చొంగ తదితరాలు ఎప్పటికీ ప్రమాద హేతువులే. వీటి నుంచి వచ్చే ఉపద్రవాలను గుర్తెరిగి తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పెంచుకోవడం ఎంతైనా అవసరం. అలాగే వాటికి సంక్రమించే పలు రకాల వ్యాధులు మానవులకు హానికరం కాకుండా చూసుకుంటూ వాటి ఆరోగ్య పరిరక్షణకు సకాలంలో చర్యలు తీసుకుంటూనే వాటిని పెంచుకునేవారికి ఆ దుష్ప్రభావాలు సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మూగజీవాలు.. వాటి వల్ల వచ్చే వ్యాధులపై సరైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జునోసిస్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు! 1
1/3

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు! 2
2/3

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు! 3
3/3

ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement