
కూటమిలో మట్టి పంచాయితీ!
మర్లావ, ఆర్బీ పట్టణాల్లో
జనసేన x టీడీపీ
పెద్దాపురం: గ్రామాల్లో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. మండలంలోని మర్లావ గ్రామంలో టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ జేసీబీతో ఏలేరు కాలువ మట్టిని తరలించుకుపోవడాన్ని జనసేన నాయకులు గవరసాని దివాకర్ వర్గీయులు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాతో పాటు, బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే మండలంలోని దివిలి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు టీడీపీ తమకు చెప్పకుండానే చేస్తున్నారని నీటి సంఘం ఉపాధ్యక్షుడు జనసేన నాయకుడు జట్లా విజయ్‌బాబు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదే విధంగా మండలంలోని ఆర్‌బీ పట్నంలో చెరువు మట్టి తవ్వకాల విషయంలోనూ జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య పోరు సాగుతోంది. అధికారులు ఇరువర్గాలకు చెప్పలేక మౌనం దాల్చడంతో ఆధిపత్యపోరులో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు.
18 మెట్రిక్ టన్నుల
రేషన్ బియ్యం పట్టివేత
● కేసు నమోదు చేసిన అధికారులు
● రూ.8.28 లక్షల సరకు స్వాధీనం
దేవరపల్లి: నల్లజర్లలోని ఓ బియ్యం మిల్లు నుంచి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు లారీలో తరలిస్తున్న 400 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండలంలోని యర్నగూడెం–పోతవరం రోడ్డులో పట్టుకున్న బస్తాల్లో సుమారు రూ.8.28 లక్షల విలువైన 18 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నట్టు మండల పౌరసరఫరాల అధికారి ఎ.సత్యనారాయణ తెలిపారు. కాగా అధికారులు నిర్వహించిన వేలంలో ఈ బియ్యాన్ని పాడుకుని తరలిస్తున్నట్టు మిల్లు యజమాని చూపిన పత్రాలు కాల పరిమితి ముగిసినవని గుర్తించినట్టు అధికారులు గుర్తించారు. లారీని, అందులోని బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఎ, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని డీటీ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ ఎస్. తాతారావు, సీఐ మధుబాబు, ఏఎస్‌ఓ నాగాంజనేయులు, వీఆర్వో ఎస్‌కే బాషా, సిబ్బంది పాల్గొన్నారు.