
రాజీ మార్గమే రాజ మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జాతీయ లోక్ అదాలత్ శనివారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని నిర్వహించారు. దీనికి హాజరైన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 85 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవని పేర్కొన్నారు. వీటిలో తాము 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ప్రీ లిటిగేషన్ కేసు లు, మొత్తం 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగినద న్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశంతో కేసులను రాజీమార్గంలో పరిష్కరిస్తున్నామన్నారు. గత ఏడాదిలో చేపట్టిన నాలుగు లోక్ అదాలత్‌లలో రూ.167 వందల కోట్లు కక్షి దారులకు నష్టపరిహారంగా అందజేసినట్టు తెలిపారు. తాజాగా పీడీజే కోర్టులోని 01/2025 కేసుకు బాధితుల కుటుంబానికి రూ.1.15 కోట్లు, 379/2023 కేసులో రూ.80 లక్షలు, 135/2025 కేసులో రూ.38.5 లక్షల చెక్కులను అంద చేశామన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, పలువురు జడ్జిలు పాల్గొన్నారు. మొత్తం బెంచీలు 47 కాగా 6179 కేసులకు అవార్డులు ఇచ్చారు. రాత్రి 9.30 గంటల వరకు 473 సివిల్ కేసులు, 5514 క్రిమినల్ కేసులు, 192 పీఎల్‌సీ కేసులకు తీర్పులు ఇచ్చారు. ఇంకా కేసుల సంఖ్యను లెక్కిస్తున్నారు.