
భీమేశ్వరాలయం నుంచి తలుపులమ్మకు సారె
రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ అమ్మవారికి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆషాఢం సారెను ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని బుధవారం సమర్పించారు. లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భీమేశ్వరాలయ అర్చకుడు మద్దిరాల రాజ్‌కుమార్‌శర్మ, చండీ పారాయణదారులు జుత్తుక చిన్న, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన ‘ఢీ’ఎస్సీ
రాయవరం: కలల కొలువును సాధించాలన్న లక్ష్యంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు డీఎస్సీ–2025 పరీక్షలకు హోరాహోరీగా సన్నద్ధమయ్యారు. ఉపాధ్యాయ కొలువులో స్థిరపడాలని కలలుకన్న వారి కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడి పరీక్షలకు హాజరయ్యారు. గత నెల ఆరో తేదీ నుంచి టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ రావిరాల నేతృత్వంలో జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా పర్యవేక్షణలో నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పరీక్ష కావడంతో కంప్యూటర్ సౌకర్యాలున్న కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాసా ఇంజినీరింగ్ కళాశాల, అమలాపురం భట్లపాలంలోని బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
10,356 మంది హాజరు
జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో 10,356 మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 11,349 మంది అభ్యర్థులకు రెండు పరీక్షా కేంద్రాలు కేటాయించగా, 1,083 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు డీఈవో డాక్టర్ సలీం బాషా తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామని, ఎక్కడా అక్రమాలు, అవకతవకలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.

భీమేశ్వరాలయం నుంచి తలుపులమ్మకు సారె