
ముందస్తుకు నీళ్లొదిలారు!
● ఉమ్మడి జిల్లాలో ముందస్తు ఖరీఫ్ సాగు లేనట్టే
● ఒకటవ తేదీన మొక్కుబడి నీటి విడుదల
● తూర్పు, మధ్య డెల్టాకు కలిపి 300 క్యూసెక్కులు మాత్రమే
● పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు
● పలుచోట్ల కాలువలపై పనులు
● మధ్య డెల్టాకు లొల్ల లాకుల వద్దనే నిలిపివేసిన అధికారులు
● ఈ మాత్రం దానికి ఎందుకు వదిలినట్టు
అని రైతుల మండిపాటు
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్‌కు ప్రధాన అవరోధం ‘ముంపు’. సాగు ఆలస్యం అయి భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో ఖరీఫ్ దిగుబడికి సిద్ధంగా కావడం వల్ల చేలు ముంపుబారిన పడి రైతులు కోట్ల రూపాయలు నష్టపోవడం పరిపాటిగా మారింది. దీనిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డెల్టాలో ముందస్తు సాగును ప్రోత్సహించింది. దీనిలో భాగంగా జూన్ ఒకటి, రెండు తేదీలలో నీరు విడుదల చేయడం మొదలు పెట్టింది. ఈసారి కూటమి ప్రభుత్వం కూడా ముందస్తు సాగుకు నీరు విడుదల చేస్తామని చెప్పి కొంత మొత్తంలో నీరు విడుదల చేసింది. దానికి కూడా పలుచోట్ల హెడ్ స్లూయిజ్‌ల సమీపంలోనే నిలిపివేయడం గమనార్హం.
కోటి ఆశల ఖరీఫ్‌కు ఆదిలోనే అవరోధం ఏర్పడింది. ముందస్తు సాగుకు వీలుగా జూన్ ఒకటి, రెండు తేదీల్లో పశ్చిమ, తూర్పు, మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు నీరు విడుదల చేశారు. కాని ఈ మూడు డెల్టాలకు కలిపి కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే నీరు వదులుతున్నారు. దీంతో పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కులు. మధ్య డెల్టాకు 100 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. దీనిలో మధ్య డెల్టాకు వదులుతున్న నీరు సమీపంలోని లొల్ల లాకుల వద్దనే నిలిపివేశారు. ఇక్కడ నిలిపివేయడం ద్వారా పి.గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్, అమలాపురం కాలువలకు నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇక తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కుల వదలడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. దీని మీద కాకినాడ, మండపేట, కోరంగి, కోటిపల్లి, సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరందాల్సి ఉంది. అలాగే పశ్చిమ డెల్టాలో ఏలూరు, నర్సాపురం బ్యాంకు కెనాల్ ద్వారా సాగునీరందాల్సి ఉంది.
ముందస్తుతో పలు విధాలుగా మేలు
ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ పంటను గట్టెక్కించడం, రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం, మూడవ పంటగా అపరాలు సాగు చేయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడం వంటి ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్‌లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంటోంది. పంట కాలువలపై మొదలు పెట్టిన పనులు ఇంకా ప్రాథమిక దశలో ఉండడంతో నీటి విడుదల ఆలస్యమై ఆ ప్రభావం ఖరీఫ్ సాగుపై పడనుంది. కాకినాడ జిల్లా పరిధిలో తూర్పు డెల్టాకు వచ్చి మొత్తం 3,40,548.78 ఎకరాల నికర ఆయకట్టు ఉండగా, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,46,155.26 ఎకరాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పు, పశ్చిమ డెల్టాలు కలిపి మొత్తం 66,692.47 ఎకరాలు ఉంది. ఇక్కడ సాగు ఆలస్యమైతే వరి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్లోజర్ పనులు ఇప్పుడు మొదలు పెట్టారు
డెల్టా పంట కాలువలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి నీళ్లు బంద్ చేశారు. అయితే చాలాచోట్ల మే 20 తరువాత క్లోజర్ పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెట్టడం గమనార్హం. ఆత్రేయపురం మండలం లొల్ల లాకు దిగువన మూడు కాలువల మీద మొదలు పెట్టిన సైఫన్ నిర్మాణాల పనులు నత్తను తలపిస్తున్నాయి. అమలాపురంలో బెండా కెనాల్ మీద ఈదరపల్లి, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణాలు సైతం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇవి కాకుండా పి.గన్నవరం, ముక్తేశ్వరం, అమలాపురం, మండపేట, కాకినాడ కాలువల మీద ఇప్పుడిప్పుడే పూడిక తీత పనులు చేపట్టడం గమనార్హం. ఈ పనులు ఈ నెల పదవ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కోనసీమ జిల్లా సమావేశంలో కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సైతం ఈ నెల పదవ తేదీకి పనులు పూర్తి చేయాలని కోరారు. అంటే ఈ నెల పది వరకు కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం లేదని తేలిపోయింది. అటువంటప్పుడు జూన్1వ తేదీన సాగు నీరు విడుదల చేయడం ఎందుకని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జూన్ పదో తేదీన నీరు విడుదల చేసినా పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడం వల్ల ఈ నెల 20వ తేదీ వరకు ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదని రైతులు పెదవి విరుస్తున్నారు.
తూర్పు డెల్టా పరిధిలో మడికి నుంచి
దుళ్ల పంటకాలువకు చేరని సాగునీరు
డెల్టా ఆయకట్టు ఇలా..
జిల్లా రిజిస్టర్ ఆయకట్టు నికర ఆయకట్టు
కోనసీమ జిల్లా 2,52,742.75 2,46,155.26

ముందస్తుకు నీళ్లొదిలారు!

ముందస్తుకు నీళ్లొదిలారు!