
పర్యావరణ రక్షణలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ మహేష్ కుమార్
● ఘనంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
అమలాపురం టౌన్: వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌పై అవగాహన పెంచుకుని చెత్త నిర్మూలన, పర్యావరణ పరిరక్షణతో భాగస్వాములు కావాలని కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ప్రజలకు సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లో శనివారం జరిగిన స్వచ్ఛత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరిగిన క్రమంలో, వాటి విని యోగం తర్వాత ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల హానికరమైన పరిణామాలు ఉత్పన్నమవుతాయన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో కొత్త మాధవి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. చివరగా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. సభలో పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని స్వచ్ఛతపై ఉపన్యసించారు. సభలో పలువురికి తడి, పొడి చెత్త వేసుకునేందుకు డబ్బాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.