
అనాథరక్షకా.. ఆపద్బాంధవా..
ఫ గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి
ఫ ఒక్కరోజే రూ.51.96 లక్షల ఆదాయం
కొత్తపేట: అనాథరక్షకా.. ఆపద్బాంధవా.. గోవిందా.. అంటూ వేలాది భక్తులు ఆ స్వామిని కొలిచారు. గోవింద నామస్మరణతో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మార్మోగింది. శనివారం వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. భారీ క్యూలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఒక్కరోజు దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.51,96,999 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయం వద్ద రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్‌ఐ ఎస్.రాము బందోబస్తు పర్యవేక్షించారు. అలాగే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వాడపల్లికి ప్రత్యేక బస్సులు నడిచాయి.