‘ఇంటర్‌ స్పాట్‌’కు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

‘ఇంటర్‌ స్పాట్‌’కు వేళాయె..

Mar 7 2025 12:21 AM | Updated on Mar 7 2025 12:21 AM

‘ఇంటర్‌ స్పాట్‌’కు వేళాయె..

‘ఇంటర్‌ స్పాట్‌’కు వేళాయె..

రాయవరం: ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ పరీక్షలు ఈ నెల 20న కెమిస్ట్రీ, కామర్స్‌తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనంపై అధికారులు దృష్టి సారించారు. 2022–23 విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పునర్విభజన జరిగిన జిల్లాల్లో తొలిసారిగా స్పాట్‌ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు గత ఏడాది కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో స్పాట్‌ వేల్యుయేషన్‌ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి శుక్రవారం ఉదయం సంస్కృతం సబ్జెక్టు పేపరుతో స్పాట్‌ వేల్యుయేషన్‌ అమలాపురంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 1,50,547 జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో చేపట్టనున్నారు. దీనికి జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి వనుము సోమసోఖరరావు క్యాంప్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.

ఏఈకి రోజుకు 30 పేపర్లు

జవాబు పత్రాల మూల్యాంకనం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తారు. ఒక అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ (ఏఈ) రోజుకు 30 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఐదుగురు ఏఈలకు ఒక చీఫ్‌ ఎగ్జామినర్‌ (సీఈ) ఉంటారు. ఏఈ మూల్యాంకనం చేసే జవాబు పత్రాలను సీఈ పరిశీలిస్తారు. ఏఈలు, సీఈ కలిపి ఉండే బోర్డుకు ఒక స్క్రూటినైజర్‌ ఉంటారు. ఏఈలు అన్ని ప్రశ్నల జవాబులు మూల్యాంకనం చేశారా, లేదా, మార్కుల టోటల్‌ తదితర విషయాలను వారు పరిశీలిస్తూంటారు. సబ్జెక్టు నిపుణులు కూడా ఏఈలు మూల్యాంకనం చేసే పేపర్లను పరిశీలించి, తేడాలుంటే సూచనలిస్తారు. జిల్లాకు వచ్చే సబ్జెక్టు పేపర్ల సంఖ్య ఆధారంగా ఏఈలు, సీఈ కలిపి ఉండే బోర్డుల సంఖ్య ఉంటుంది.

జవాబు పత్రాల కేటాయింపు ఇలా..

ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఫస్టియర్‌ 82,217, సెకండియర్‌ 68,330 కలిపి జిల్లాకు మొత్తం 1,50,547 జవాబు పత్రాలు కేటాయించారు. ఇప్పటికే సంస్కృతం, తెలుగు పేపర్లు స్పాట్‌ వేల్యుయేషన్‌ కేంద్రానికి చేరాయి. మిగిలిన పేపర్లు కూడా దశలవారీగా చేరనున్నాయి. ఫస్టియర్‌కు సంబంధించి ఇంగ్లిషు 14,024, తెలుగు 5,561, హిందీ 264, సంస్కృతం 5,540, గణితం–1ఎ 9,229, గణితం–1బి 9,467, బోటనీ 2,880, జువాలజీ 2,742, ఫిజిక్స్‌ 11,812, కెమిస్ట్రీ 11,432, ఎకనామిక్స్‌ 3,371, వాణిజ్య శాస్త్రం 2,492, హిస్టరీ 691, సివిక్స్‌ 2,712 జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో చేపట్టనున్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిషు 11,729, తెలుగు 4,277, హిందీ 235, సంస్కృతం 4,929, గణితం–2ఎ 8,031, గణితం–2బి 8,021, బోటనీ 2,336, జువాలజీ 2,180, ఫిజిక్స్‌ 10,351, కెమిస్ట్రీ 9,856, ఎకనామిక్స్‌ 2,280, వాణిజ్య శాస్త్రం 1,754, హిస్టరీ 459, సివిక్స్‌ 1,892 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించారు. మూల్యాంకనం ప్రక్రియ వచ్చే నెల రెండో వారంలో పూర్తయ్యే అవకాశముంది. మూల్యాంకనానికి అవసరమైన సిబ్బంది నియామకం దాదాపు పూర్తి కావచ్చింది.

నేటి నుంచి మూల్యాంకనం

జిల్లాకు 1.50 లక్షల జవాబు పత్రాల కేటాయింపు

ఏర్పాట్లు పూర్తి

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అన్ని ఏర్పాట్లూ చేశాం. ఎటువంటి అవకతవకలకూ ఆస్కారం లేని విధంగా మూల్యాంకనం చేపట్టనున్నాం. ఇప్పటికే జరిగిన పరీక్షల జవాబు పత్రాలు చేరుకోగా, జరగాల్సిన పరీక్షలకు సంబంధించినవి త్వరలో చేరనున్నాయి.

– వనుము సోమశేఖరరావు,

జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి, అమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement