మరోసారి మోసానికి తెరతీసిన కూటమి | - | Sakshi
Sakshi News home page

మరోసారి మోసానికి తెరతీసిన కూటమి

Mar 2 2025 12:04 AM | Updated on Mar 2 2025 12:04 AM

మరోసా

మరోసారి మోసానికి తెరతీసిన కూటమి

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు

అమలాపురం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూస్తుంటే మరోసారి మోసానికి తెరతీసినట్లు ఉందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్‌ సిక్స్‌ పథకాలంటూ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆ పథకాల అమలుకు కేటాయింపులు ఏమీ చేయలేదన్నారు. తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు బడ్జెట్‌లో కేటాయించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 143 హామీలను గాలిలో కలిపేసేలా బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ విమర్శించారు. ఇందులో పేదల ప్రయోజనాలు కనిపించలేదని అన్నారు. అమరావతిని ప్రపంచ బ్యాంక్‌ ఇచ్చిన అప్పుతో అభివృద్ధి చేయనున్నారని, బడ్జెట్‌లో అదేదో కూటమి ప్రభుత్వం గొప్పలుగా చెబుతోందన్నారు. ఈ బడ్జెట్‌ డబ్బున్న వ్యక్తులకు, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలమైందని చెప్పారు. రైతులు, చేనేత కార్మికులు ఇలా ప్రతి రంగానికి అన్యాయం జరిగిందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ నాయకుడు ముంగర ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఆర్థిక భారం మోపేలా బడ్జెట్‌

ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలపై పన్నుల భారం మోపేలా ఉందని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు విమర్శించారు. గత ప్రభుత్వం కంటే పథకాలకు, సంక్షేమానికి చాలా తక్కువగా నిధులు కేటాయించి, ఎన్నికల హామీలు అమలు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. ప్రత్తిపాడు లిబరేషన్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తలకు మించి హామీలిచ్చిన చంద్రబాబు తల్లికి వందనంలో నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించకుండానే కేటాయింపులు చేశారన్నారు. గత ప్రభుత్వం రూ.17 వేల కోట్లు అమ్మ ఒడికి కేటాయించి, ఇంటికి ఒకరికి అమలు చేస్తే... ప్రస్తుతం బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించి అందరికీ వర్తింపచేస్తాననడం బూటకం కాదా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం రైతు భరోసాకు రూ. 1800 కోట్లు, ఇరిగేషన్‌ శాఖకు రూ. 24.73 వేల కోట్లు, విద్యకు రూ. 11.03 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 6.02 కోట్లు కేటాయిస్తే... ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాకు రూ. 900 కోట్లు, ఇరిగేషన్‌కు రూ. 23.98 కోట్లు, విద్యకు రూ. 10.9 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 0.98 కోట్లు కేటాయించడం చూస్తుంటే మౌళిక వసతులను నిర్లక్ష్యం చేసేలా ఉందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంతవరకు ఇస్తానన్న నిరుద్యోగ భృతికి కేటాయింపులే లేవన్నారు. రాష్ట్రంలో 16,340 టీచర్‌ పోస్టులు డీఎస్సీ ద్వారా ప్రకటించారని, ఇది ముందుకు సాగే విధాన ప్రకటన లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 19 ఏళ్లు దాటిన మహిళలకు ఆసరా పథకానికి బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం.. ప్రజలను దగా చేయడమేనన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాష్ట్రానికి తీసుకురాలేదన్నారు. సమావేశంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకొండ లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు.

మరోసారి మోసానికి తెరతీసిన కూటమి1
1/1

మరోసారి మోసానికి తెరతీసిన కూటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement