
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూ.253.76 కోట్ల జమ
● 2,97,079 మందికి లబ్ధి
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత పథకాలు వారి కుటుంబాలను ఆర్థిక ప్రగతి వైపు నడిపిస్తున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. సంఘటిత శక్తితో స్వయం ఉపాధికి బాటలు వేసుకునేందుకు ఆసరా పతకం ఆర్థిక పరిపుష్టిని అందిస్తోందని చెప్పారు. మూడో విడత ఆసరా పథకం లబ్దిని రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డీబీటీ విధానంలో శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో ప్రారంభించారు. ఇందులో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శుక్లా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2019 ఏప్రిల్ 11వ తేదీ లోపు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే ఏర్పాటు చేసిందని చెప్పారు. వారి రుణాలను మాఫీ చేసి, నాలుగు వాయిదాల్లో చెల్లిస్తోందన్నారు. జిల్లాలో మూడో విడత కింద 31,020 సంఘాల్లోని 2,97,079 మంది సభ్యుల బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం రూ.253.76 కోట్లు జమ చేసిందని వివరించారు. లబ్ధి పొందిన మహిళలు మాట్లాడుతూ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హితకారిణి సమాజం చైర్‌పర్సన్ కాశి బాల మునికుమారి, అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్, డీఆర్‌డీఏ పీడీ వి.శివశంకర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఒమ్మి అయ్యప్పనాయుడు, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, వెఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.4 లక్షల మాఫీ
మాది అమలాపురం ఒకటో వార్డు మెట్ల కాలనీ. శ్రీధనలక్ష్మి డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నాను. 2019 జనవరి నెల నాటికి మా సంఘానికి బ్యాంక్ లింకేజీ రుణం రూ.4 లక్షల బకాయి ఉంది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి వర్తించింది. ఇప్పటి వరకూ మూడు విడతల రుణమాఫీ పొందాను. మాఫీ ద్వారా సమకూరిన డబ్బులతో టైలరింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. నా కుటుంబం నిలదొక్కుకునేలా చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటాను. – వి.వెంకటేశ్వరి
నేత నేసుకుని జీవించేలా
‘ఆసరా’ సాయపడింది
మాది అమలాపురం రూరల్ మండలం బండార్లంక. స్వాతి డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నాను. డ్వాక్రా రుణమాఫీ ద్వారా మా సంఘానికి రూ.7.50 లక్షలు వస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా ఒక్కో సభ్యురాలు రూ.18 వేల చొప్పున అందుకున్నాం. మూడు విడతలుగా నాకు వచ్చింది రూ.54 వేలు. నేత నేసుకుంటూ మా కుటుంబం ఆర్థికంగా బలపడేందుకు ఈ డబ్బు ఆసరా అయింది. ముఖ్యమంత్రి జగన్ మేలు ఎప్పటికీ మర్చిపోలేం.
– మల్లీశ్వరి

