
పరుగు పోటీల్లో పాల్గొన్న మహిళలు
అమలాపురం రూరల్: విజయవాడ ఏపీ క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలలో అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో మహిళలకు క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు జరిగే వివిధ క్రీడా పోటీల్లో భాగంగా 100 మీటర్లు, 1600 మీటర్లు లాంగ్ జంప్ ఈవెంట్లల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు సురేష్‌కుమార్ మాట్లాడుతూ మహిళల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. కళాశాల పీడీ కేఎన్ ప్రసాద్, బాస్కెట్‌బాల్ శిక్షకులు భీమేష్, అథ్లెటిక్ శిక్షకులు ఐ.సురేష్, రెజ్లింగ్ శిక్షకురాలు కనకదుర్గ, టైక్వాండో శిక్షకులు సత్యనారాయణ కార్యాలయ ఉద్యోగి కామేష్ పాల్గొన్నారు.