మెట్రోలో సీటు గొడవ.. ప్రాణం తీసిన రిటైర్డ్ ఐఏఎస్ అహంకారం | Retired IAS Officer And Son Arrested After Delhi Metro Seat Dispute Turns Fatal, Man Dies Following Chest Blow | Sakshi
Sakshi News home page

మెట్రోలో సీటు గొడవ.. ప్రాణం తీసిన రిటైర్డ్ ఐఏఎస్ అహంకారం

Oct 13 2026 9:28 AM | Updated on Oct 13 2026 11:18 AM

Retired IAS officer, son arrested over fatal Delhi Metro altercation

సాక్షి,న్యూఢిల్లీ: “మర్‌ గయా, మర్‌ గయా తేరా భాయ్‌ గిర్‌ గయా..” (చనిపోయాడు.. మీ అన్నయ్య కిందపడిపోయి చనిపోయాడు).. ఫోన్‌లో వణికిపోతున్న తల్లి గొంతు నుంచి వస్తున్న ఆ మాటలు విన్న చిన్న కొడుకు దీపక్‌ ఒక్కక్షణం ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాడు. ఏం మాట్లాడాలో తెలియక నిశ్చేష్టుడయ్యాడు. మరికొద్ది రోజుల్లో ఘనంగా పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సిన అన్నయ్య అకస్మాత్తుగా మరణించడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశాడు.

నవంబర్‌ 2న పవన్‌ శర్మ 49వ పుట్టినరోజును ఘనంగా జరపాలని కుటుంబ సభ్యులంతా కలిసి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ్ముడు దీపక్‌ తన అన్నయ్యకు ఓ సర్ప్రైజ్‌ ప్లాన్‌ చేశాడు. కానీ, విధి మరోలా తలచింది. మెట్రో రైలులో సీటు కోసం జరిగిన చిన్న గొడవ ప్రాణం మీదికి తెచ్చింది. పవన్‌ ప్రాణాన్ని బలితీసుకుంది.

సీటు కోసం గొడవ
అక్టోబర్‌ 8న పవన్‌ శర్మ, ఆయన తల్లి దుర్గ (65) గురుగ్రామ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న కుమారుడు దీపక్‌ను చూసేందుకు వెళ్లారు. అనంతరం, యమునా విహార్‌లోని తమ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా మండి హౌస్‌ మెట్రో స్టేషన్‌లో నోయిడాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్‌ ప్రతాప్‌ సింగ్‌, ఆయన కుమారుడు సిద్ధార్థ్‌ సింగ్‌ అదే ట్రైన్‌ ఎక్కారు. పవన్‌, ఆయన తల్లి కూర్చున్న సీటు వద్ద వివాదం తలెత్తింది. సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించిన ఆ సీట్లను ఖాళీ చేయాలని ఆ తండ్రీకొడుకులు దుర్భాషలాడారు. దురుసుగా ప్రవర్తించారు.

దీంతో పవన్‌, దుర్గ తాము కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడ్డారు. అయినా సరే నిందితులు శాంతించలేదు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. తట్టుకోలేక పవన్‌ వెళ్తూ వెళ్తూ.. “మేం వెళ్తున్నాం, కావాలంటే మీరు ఆ సీట్లలో పడుకోవచ్చు” అని సమాధానం ఇచ్చాడు. అంతే.. “నీకెంత ధైర్యం.. నన్నే అంటావా?” అంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. పవన్‌ కాలర్‌ పట్టుకుని చెంపదెబ్బ కొట్టాడు. పవన్‌ కూడా ప్రతిఘటించాడు.

ఛాతిపై బలంగా తన్నడంతో
ఈసారి సంజయ్‌ కొడుకు సైతం పవన్‌పై దాడి చేశాడు. ఆయన ఛాతిపై బలంగా గుద్దాడు. రైలు సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌ సమీపంలో ఉండగా పవన్‌ స్పృహ కోల్పోయాడు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు పవన్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

పవన్‌పై దాడి గురించి తల్లి దుర్గ కుమారుడు దీపక్‌కు ఫోన్‌ చేసి భయంతో వణికిపోయింది. ‘మర్‌ గయా, మర్‌ గయా తేరా భాయ్‌ గిర్‌ గయా..’ అంటూ ఆమె మాటల్లోని కంగారు దీపక్‌ను భయాందోళనకు గురిచేసింది.

“అన్నయ్యకు ఏమైందో తెలుసుకుందామని హుటాహుటీనా ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి చేరుకున్నాను. నేను వెళ్లేసరికి మా అమ్మ స్పృహతప్పి పడిపోతోంది. ఆసుపత్రి సిబ్బంది ఏం జరిగిందో సరిగ్గా చెప్పలేదు. లోపలికి వెళ్లి చూసేసరికి నా అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు” అంటూ దీపక్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ట్రైన్‌లో సీటు విషయంలో గొడవ ప్రారంభమై, అన్యాయంగా తన అన్నయ్య ఛాతిపై బలంగా గుద్దడం వల్లే అతను కుప్పకూలిపోయాడని దీపక్‌ ఆరోపించారు. పవన్‌ ఎవరితోనూ గొడవకు వెళ్లే వ్యక్తి కాదని తెలిపారు.

తండ్రీకొడుకుల అరెస్ట్
ఈ ఘటనపై బాధితురాలైన దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితులైన తండ్రీకొడుకులను అరెస్ట్ చేసి, 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

కుటుంబానికి ఏకైక ఆధారం పవనే..
పవన్‌ మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు కాలేజీ మొదటి సంవత్సరం చతువుతుండగా, కుమార్తె పదో తరగతి చదువుతోంది. క్లర్క్‌గా పనిచేస్తున్న పవనే ఆ కుటుంబానికి ఏకైక ఆధారం. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ తానే మోస్తూ, పిల్లలను ప్రయోజకులను చేయాలని కలలు కన్న పవన్‌ దూరమవ్వడంతో ఆ కుటుంబం భవిష్యత్తు అంధకారంలోకి నెట్టింది. 

రిటైర్డ్‌ ఐఏఎస్‌..సీబీఐ అరెస్ట్‌ చేసింది. 
నిందితుడైన సంజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఢిల్లీ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల సంక్షేమ శాఖలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ ప్రతాప్ సింగ్‌ను లంచం కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఆ శాఖకు సెక్యూరిటీ గార్డులు, ప్యూన్‌లను సరఫరా చేసే ఓ మ్యాన్‌పవర్ సప్లయర్ సంస్థ నుండి రూ.2.2 లక్షల లంచం తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో సంజయ్‌ సింగ్‌, అతని పీఏని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

అతని ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో సీబీఐ అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా సంజయ్‌ ఆస్తుల్ని గుర్తించారు. బ్యాంకు లాకర్‌లో సుమారు 3.2 కిలోల బరువు, రూ.80 లక్షలకు పైగా విలువైన 31 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 800 గ్రాముల వెండి, 300 వందల బ్లూ లేబుల్, గ్లెన్‌మొరాంగీ వంటి ఖరీదైన మద్యం బాటిళ్లు, రోలెక్స్, రాడో బ్రాండెడ్‌ వాచీలను గుర్తించింది.  

ఢిల్లీలో వందల కోట్లు విలువ చేసే ఎనిమిది ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. వీటిలో నోయిడాలో మూడు ఆస్తులు, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్‌లలో రెండేసి చొప్పున,దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో ఒకటి ఉన్నాయి. పవన్ శర్మ మరణం కేసులో సింగ్‌ను అరెస్టు చేయడంతో, లంచం కేసులో గతంలో అతని అరెస్టు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి : కుప్పం: మద్యం మత్తులో ఐఏఎస్‌ వికాస్ మర్మత్ వీరంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement