ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీలో ముందుండేందుకు ఓపెన్ఏఐ ఎప్పటికప్పుడు.. తన సాంకేతిక సామర్థ్యాలను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. సంస్థలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాన్ని పర్యవేక్షించిన సచిన్ కట్టి స్థానంలో ఉదయ్ రుద్దరాజుకు బాధ్యతలు అప్పగించింది.
ఉదయ్ రుద్దరాజు గత ఏడాది ఓపెన్ ఏఐలో చేరారు. జూలైలో కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సంస్థలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటింగ్ విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. కాగా.. సచిన్ కట్టి రాబోయే కొన్ని వారాల్లో తన ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పుకుని, కంపెనీలో సలహాదారుగా కొనసాగనున్నారు. సంస్థలో పనిచేసిన సమయంలో కట్టి పలు భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులను పర్యవేక్షించారు.
ఓపెన్ఏఐ డేటా సెంటర్లపై ఎక్కువ దృష్టిపెడుతోంది. దీనికి కారణం చాట్జీపీటీ వంటి ఏఐ వ్యవస్థలు పనిచేయాలంటే భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. ఇందుకోసం అధిక సామర్థ్యం కలిగిన చిప్లు, సర్వర్లు, నిరంతర విద్యుత్ సరఫరా, శీతలీకరణ వ్యవస్థలు అవసరమవుతాయి. వీటన్నింటినీ ఏర్పాటు చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
ఓపెన్ఏఐ అధినేత శామ్ ఆల్ట్మన్ కూడా భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాల కోసం ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఖర్చు చేయాల్సి రావచ్చని గతంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ.6.99 లక్షలకే.. 2026 టయోటా గ్లాంజా!


